సన్‌రైజర్స్‌ ఛేదించేనా?

18 Oct, 2020 17:30 IST|Sakshi

అబుదాబి:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న  మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ తొలుత ఫీల్డింగ్‌ తీసుకోవడంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్‌, రాహుల్‌  త్రిపాఠిలు ధాటిగా ఆరంభించారు. కాగా, త్రిపాఠి(23; 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో 48 పరుగుల వద్ద మొదటి వికెట్‌ నష్టపోయింది కేకేఆర్‌. ఆపై గిల్‌కు నితీష్‌ రాణా జత కలిశాడు. ఈ జోడి దూకుడుగా ఆడుతున్న సమయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ మంచి బ్రేక్‌ సాధించింది. వరుస ఓవర్లలో గిల్‌(36; 37 బంతుల్లో 5 ఫోర్లు), రాణా(29; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)లు పెవిలియన్‌ చేరారు. రషీద్‌ ఖాన్‌ వేసిన 12 ఓవర్‌ నాల్గో బంతికి గిల్‌ ఔట్‌ కాగా, విజయ్‌ శంకర్‌ వేసిన 13 ఓవర్‌ తొలి బంతికి రాణా ఔటయ్యాడు. వీరిద్దరూ ప్రియాం గార్గ్‌ అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో పెవిలియన్‌ చేరక తప్పలేదు. ఆ తర్వాత రసెల్‌(9) నిరాశపరచగా, చివర్లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌లు ఆకట్టుకోవడంతో కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో  నటరాజన్‌ రెండు వికెట్లు సాధించగా, విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌, బాసిల్‌ థంపిలకు తలో వికెట్‌ దక్కింది. 

కార్తీక్‌ మెరుపులు
తనకు కెప్టెన్సీ వద్దంటూ లీగ్‌ మధ్యలో దాన్ని ఇయాన్‌ మోర్గాన్‌కు త్యాగం చేసిన దినేశ్‌ కార్తీక్‌ మెరుపులు మెరిపించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్‌ చాలా స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝుళిపించాడు. కెప్టెన్సీ ఒత్తిడి నుంచి బయటపడిన కార్తీక్‌ అందుకు తగ్గట్టే రాణించాడు. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అతనికి జతగా మోర్గాన్‌కు కూడా రాణించడంతో కేకేఆర్‌ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. కార్తీక్‌ 14 బంతుల్లో అజేయంగా 29 పరుగులు సాధించగా,  మోర్గాన్‌ 23 బంతుల్లో 34 పరుగులు చేశాడు. మోర్గాన్‌ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉంది. ఈ జోడి 58 పరుగులు జత చేయడంతో కేకేఆర్‌ గౌరవప‍్రదమైన స్కోరు చేసింది. మరి కేకేఆర్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు