తిరుగులేని రికార్డుతో ముంబై..

16 Oct, 2020 19:19 IST|Sakshi

అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మొదటి బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదింట విజయం సాధించగా, కేకేఆర్‌ ఏడు మ్యాచ్‌లకు గాను నాలుగు విజయాలు సాధించింది. ముంబై రెండో స్థానంలో కొనసాగుతుండగా, కేకేఆర్‌ నాల్గో స్థానంలో ఉంది. ఇక ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంకం మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 26 మ్యాచ్‌లు జరగ్గా అందులో ముంబై 20 విజయాల్ని కైవసం చేసుకోగా, కేకేఆర్‌ 6 మ్యాచ్‌ల్లో మాత్రమే జయభేరి మోగించింది. ఇక ఇరుజట్లు తలపడిన చివరి 11 మ్యాచ్‌ల్లో 10సార్లు ముంబైనే విజయం వరించింది. కేకేఆర్‌పై తిరుగులేని రికార్డు కల్గి ఉన్న ముంబై అదే జోష్‌ను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా, కేకేఆర్‌ రెండు మార్పులు చేసింది. ముంబై జట్టులో కౌల్టర్‌ నైల్‌ జట్టులోకి వచ్చాడు. పాటిన్‌సన్‌ స్థానంలో కౌల్టర్‌ నైల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక కేకేఆర్‌ జట్టులోకి క్రిస్‌ గ్రీన్‌ వచ్చాడు. అదే సమయంలో శివం మావి తిరిగి జట్టులో చేరాడు. బాంటన్‌, నాగర్‌కోటిలకు విశ్రాంతి ఇచ్చారు.

మోర్గాన్‌ వర్సెస్‌ బుమ్రా
ఈ మ్యాచ్‌లో ఇయాన్‌ మోర్గాన్‌-జస్‌ప్రీత్‌ బుమ్రాల మధ్య పోరు జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌ల్లో బుమ్రా 11 వికెట్లు సాధించాడు. అందులో బుమ్రా ఎకానమీ 7.92గా ఉంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా అద్భుతమైన స్పెల్‌తో ఇరగదీశాడు. 20 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చాడు. ఇక మోర్గాన్‌ ఏడు మ్యాచ్‌ల్లో 175 పరుగులు సాధించాడు. ఇక్కడ మోర్గాన్‌ 126. 62 గా ఉంది. ఇది మోర్గాన్‌ ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యధికంగా ఉంది. దాంతో మోర్గాన్‌ బ్యాట్‌ ఝుళిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దినేశ్‌ కార్తీక్‌ కేకేఆర్‌ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవడంతో మోర్గాన్‌ సారథిగా నియమించబడ్డాడు. దాంతో మోర్గాన్‌పై కెప్టెన్సీ భారం కూడా ఉంది. అయితే ఇంగ్లండ్‌కు వరల్డ్‌కప్‌ సాధించిన అనుభవం ఉన్న మోర్గాన్‌.. కేకేఆర్‌ కెప్టెన్‌గా సక్సెస్‌ అవుతాడని ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఆశిస్తున్నారు. 

ముంబై ఇండియన్స్‌
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, కృనాల్,‌ రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కౌల్టర్‌ నైట్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా

కేకేఆర్‌
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, క్రిస్‌ గ్రీన్‌, ప్యాట్‌ కమిన్స్‌, శివం మావి, వరుణ్‌ చక‍్రవర్తి, ప్రసిద్ధ్‌ కృష్ణ
 

మరిన్ని వార్తలు