బౌలర్లు లైన్‌ తప్పితే సిక్సర్ల మోతే!

3 Oct, 2020 19:05 IST|Sakshi

షార్జా:  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌.. ముందుగా ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఢిల్లీ, కోల్‌కతాలు ఇప్పటివరకూ తలో మూడేసి మ్యాచ్‌లు ఆడి రెండేసి చొప్ఫున విజయం సాధించాయి. కాగా, ఇరుజట్ల మధ్య ఇప్పటివరక 24 మ్యాచ్‌లు జరగ్గా కేకేఆర్‌ 13 మ్యాచ్‌ల్లో ఢిల్లీ 11మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. గత మ్యాచ్‌లో రాజస్తాన్‌ను కేకేఆర్‌ ఓడించగా, ఇక సన్‌రైజర్స్‌ చేతిలో ఢిల్లీ ఓడిపోయింది. దాంతో కేకేఆర్‌ ఈ మ్యాచ్‌కు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి గాడిలో పడాలని శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఢిల్లీ ఆశిస్తోంది. 

షార్జాలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు భారీ స్కోరును బోర్డుపై ఉంచాలి. షార్జాలోని స్మాల్‌ గ్రౌండ్‌లో బౌండరీల మోత మోగే అవకాశం ఉంది. ఇది బౌలర్లకు పరీక్షగా నిలిచే అవకాశం ఉంది. కేకేఆర్‌ బౌలర్లలో కమిన్స్‌, మావి, నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తిలకు సవాల్‌ ఎదురుకానుంది. మరొకవైపు గిల్‌, ఇయాన్‌ మోర్గాన్‌లు ఫామ్‌లో ఉండటంతో ఢిల్లీ పేసర్లు రబడా, నోర్త్‌జేలు తమ లైన్‌కు కట్టుబడి బౌలింగ్‌ వేయాలి. రాజస్తాన్‌ రాయల్స్‌-కింగ్స్‌ పంజాబ్‌ మ్యాచ్‌లో కాట్రెల్‌కు ఎదురైన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ-కేకేఆర్‌ పేసర్లు బరిలోకి దిగాలి. ఏమాత్రం తేడా వచ్చినా సిక్సర్ల మోత మోగనుంది.  ఇరుజట్లలో క్వాలిటీ బౌలర్లు ఉండటంతో పాటు పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కల్గి ఉండటంతో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు