ఆండ్రీ రసెల్‌ అవుట్‌..

21 Oct, 2020 19:04 IST|Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బుధవారం ఆసక్తికర పోరు జరగనుంది. 39వ లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఏంచుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె లీగ్‌ మ్యాచ్‌లో 82 పరుగులతో ఆర్‌సీబీ కేకేఆర్‌పై భారీ విజయం సాధించింది. లీగ్‌ ఆరంభంలో తడబడిన ఆర్‌సీబీ ఆ తర్వాత విజయాలతో ఫుంజుకుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. సరిగ్గా అన్నే మ్యాచ్‌లాడిన కేకేఆర్‌ మాత్రం 5 విజయాలు, 4 ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. ఇక లీగ్‌ ప్రారంభం నుంచి పడుతూ లేస్తూ వస్తున్న కేకేఆర్‌ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ ద్వారా విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

ఆర్‌సీబీ జట్టు విషయానికి వస్తే.. కెప్టెన్‌ కోహ్లి అంతా తానై నడిపిస్తుండగా... ఏబీ డివిలియర్స్‌ తన విధ్వంసం కొనసాగిస్తున్నాడు. దేవ్‌దూత్‌ పడిక్కల్‌, ఆరోన్‌ ఫించ్‌లు కూడా బ్యాట్‌తో రాణిస్తుండడంతో బ్యాటింగ్‌ విభాగం దుర్బేద్యంగా ఉంది. ఇక కెప్టెన్‌ కోహ్లి ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 347 పరుగులు చేసి జట్టు తరపున టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. మిస్టర్‌ 360గా పేరు పొందిన ఏబీ 9మ్యాచ్‌ల్లో 285 పరుగులు చేసి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 55 పరుగులు చేసిన ఏబీ తన విధ్వంసంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక బౌలింగ్‌లో క్రిస్‌ మోరిస్‌ తన బౌలింగ్‌తో మోత మోగిస్తుండగా.. చహల్‌ కీలకంగా మారాడు. చహల్‌ 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీయగా.. మోరిస్‌ 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో ఆకట్టుకున్నాడు. 

కేకేఆర్‌ జట్టు విషయానికి వస్తే.. ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ 9 మ్యాచ్‌ల్లో 311 రన్స్‌తో జట్టు తరపున టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ 248 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో వరుణ్‌ చక్రవర్తి 8 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీయగా.. శివమ్‌ మావి 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. ఇరు జట్లు ఇప్పటివరకు 25 మ్యాచ్‌ల్లో ముఖాముఖి పోరులో తలపడగా.. కేకేఆర్‌ 14 విజయాలు.. ఆర్‌సీబీ 11 విజయాలు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ షహ్‌బాజ్‌ అహ్మద్‌ స్థానంలో సిరాజ్‌కు అవకాశం ఇవ్వగా.. కేకేఆర్‌ ఆండ్రీ రసెల్‌ స్థానంలో టామ్‌ బాంటన్‌, శివమ్‌ మావి స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణను బరిలోకి దించింది.

ఆర్‌సీబీ జట్టు : 
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, అరోన్‌ ఫించ్‌, దేవదూత్‌ పడిక్కల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, గుర్‌కీరత్‌ మన్‌, మహ్మద్‌ సిరాజ్‌‌, క్రిస్‌ మోరిస్‌, ఇసురు ఉదాన, నవదీప్‌ సైనీ,  చహల్‌

కేకేఆర్‌ జట్టు :
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, దినేశ్‌ కార్తీక్‌, టామ్‌ బాంటన్ ‌, ప్యాట్‌ కమిన్స్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌, ఫెర్గ్యూసన్‌, వరుణ్‌ చక్రవర్తి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు