టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఇంగ్లండ్‌ ఫ్లైట్‌ ఎక్కనున్న స్టార్ ప్లేయర్‌

24 May, 2021 18:28 IST|Sakshi

ముంబై: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు రూట్‌ సేనతో ఐదు టెస్టుల సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్‌ ఫ్లైట్ ఎక్కనున్న భారత జట్టుతో స్టార్ ఆటగాడు కే ఎల్ రాహుల్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. అపెండిసైటిస్‌కు జరిగిన సర్జరీ కారణంగా అతను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాల్సి ఉండింది. ఈ క్రమంలో అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో జట్టుతో పాటు ఇంగ్లండ్ బయల్దేరేందుకు బీసీసీఐ పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. 

రాహుల్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే జట్టులోకి రావొచ్చని జట్టు ఎంపిక సమయంలోనే సెలక్టర్లు పేర్కొన్న విషయం విధితమే. ఈ  ఏడాది ఐపీఎల్ మధ్యలో రాహుల్ అపెండిసైటిస్‌తో బాధ పడ్డాడు.  రాహుల్‌ చివరిసారిగా 2019 సెప్టెంబర్లో  వెస్టిండీస్‌తో టెస్టులో ఆడాడు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో జట్టులోనే ఉన్నప్పటికీ అతనికి  తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. 29 ఏళ్ల  రాహుల్‌ ఇప్పటి వరకు 36 టెస్టుల్లో  2006 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 11 అర్ధశతకాలున్నాయి. ఇదిలా ఉంటే, కోహ్లి సారథ్యంలోని భారత జంబో జట్టు జూన్‌ 2న ఇంగ్లండ్ బయల్దేరనుంది. ఈ పర్యటనలో తొలుత(జూన్‌ 18న) డబ్ల్యూటీసీ ఫైనల్‌ల్లో న్యూజిలాండ్ తో తలపడనున్న టీమిండియా .. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. 

మరిన్ని వార్తలు