‘కోహ్లి, ఏబీని ఐపీఎల్‌ నుంచి నిషేధించండి’

14 Oct, 2020 21:52 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌( కర్టసీ : బీసీసీఐ)

పంజాబ్‌ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సరదా వ్యాఖ్యలు

అబుదాబి: ఐపీఎల్‌ -2020 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదింటిలో గెలుపొందిన పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని ఆర్సీబీ జట్టు గురువారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు పూమా ఇండియా నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ఆర్సీబీ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లి, ఏబీ డివిల్లియర్స్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అవకాశం వస్తే గనుక వీరిద్దరిపై నిషేధం విధించాలని ఐపీఎల్‌ నిర్వాహకులను కోరతానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. (చదవండి: కోహ్లి బ్యాట్స్‌ దొంగలిస్తా : డివిలియర్స్‌)

‘‘వచ్చే ఏడాది మీ ఇద్దరు ఐపీఎల్‌ ఆడకుండా నిషేధం విధించాలని నిర్వాహకులను అడుగుతాను. ఎందుకంటే, ఒకానొక సమయంలో, నిర్దిష్టమైన పరుగులు చేసిన తర్వాత ప్రేక్షకులే ఇక చాలు అంటారు. 5 వేల మార్కును చేరుకుంటే చాలు. ఆ తర్వాత వేరే వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి కదా’’ అంటూ కోహ్లితో జోక్‌ చేశాడు. ఇక ఈ సరదా సంభాషణతో పాటు మరికొన్ని సీరియస్‌ అంశాల మీద కూడా కోహ్లి, రాహుల్‌ చర్చించారు. ‘‘భారీ షాట్‌ ఆడి(100 మీటర్లకు పైగా) సిక్స్‌ కొట్టిన ఆటగాడికి ఆరు కంటే ఎక్కువ పరుగులు ఇచ్చే నిబంధన తీసుకువస్తే బాగుంటుంది. ఓ బ్యాట్స్‌మెన్‌గా ఇది నా అభిప్రాయం’’అని రాహుల్‌ వ్యాఖ్యానించగా, అయితే ఈ విషయం గురించి ముందుగా బౌలర్లతో మాట్లాడాలి అంటూ కోహ్లి ఆటపట్టించాడు.

ఇందుకు స్పందించిన రాహుల్‌, ఓ బ్యాటర్‌గా మాత్రమే తన అభిప్రాయం చెప్పానంటూ మరోసారి స్పష్టం చేశాడు. ఇక ఒక్క పరుగు కూడా గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న కోహ్లి, వైడ్‌ రివ్యూ గురించి చేసిన ప్రతిపాదనను రాహుల్‌ స్వాగతించాడు. ఇలాంటి ఓ నిబంధన ఉంటే క్లిష్ట సమయాల్లో జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌, ఒకదాంట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా అనారోగ్యం పాలై కోలుకున్న హిట్టర్‌ క్రిస్‌గేల్‌ రేపటి మ్యాచ్‌లో తప్పకుండా ఆడతాడని పంజాబ్‌ జట్టు ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా గేల్‌ మెరుపులు చూసే అవకాశం లభిస్తుందని, అతడి రాకతో టీం తలరాత మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు