KL Rahul: ఒక్క విజయంతో దిగ్గజాల సరసన చోటు..

19 Aug, 2022 07:13 IST|Sakshi

సీనియర్ల గైర్హాజరీలో టీమిండియా యువ జట్టు జింబాబ్వే పర్యటనలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే జట్టు కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ ఒక అరుదైన ఫీట్‌ అందుకున్నాడు. కేవలం ఒక్క విజయంతోనే దిగ్గజాల సరసన చేరిపోయాడు. విషయంలోకి వెళితే.. టీమిండియాకి వన్డేల్లో 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన 8వ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు.

ఇంతకుముందు 1975లో వెంకటరాఘవన్, 1984లో సునీల్ గవాస్కర్, 1997లో సచిన్ టెండూల్కర్, 1998లో మహమ్మద్ అజారుద్దీన్ ఈ ఫీట్ సాధించగా.. ఇక సౌరవ్ గంగూలీ 2001లో 10 వికెట్ల తేడాతో విజయం అందుకోగా ఆ తర్వాత ఈ ఫీట్‌ను 2016లో ఎంఎస్ ధోనీ అందుకున్నాడు. మధ్యలో కోహ్లి చాలాకాలం కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికి ఈ ఫీట్‌ను అందుకోలేకపోయాడు. అయితే మళ్లీ రోహిత్ శర్మ 2022లో 10 వికెట్ల తేడాతో వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. తాజా విజయంతో కేఎల్ రాహుల్‌కి ఈ జాబితాలో చేరిపోయాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(113 బంతుల్లో 81 నాటౌట్‌), శుబ్‌మన్‌ గిల్‌( 71 బంతుల్లో 82 నాటౌట్‌).. జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మెరుపులు మెరిపించారు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకముందు టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. కేఎల్‌ రాహుల్‌ నమ్మకాన్ని నిజం చేస్తూ దీపక్‌  చహర్‌, ప్రసిధ్‌ కృష్ణ వరుస విరామాల్లో వికెట్లు తీశారు.

50 ఓవర్లు ఆడడంలో విఫలమైన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌​ చకాబ్వా 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఒక దశలో 107 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే కనీసం 150 పరుగుల మార్క్‌నైనా దాటుతుందా అన్న అనుమానం వచ్చింది. కానీ చివర్లో రిచర్డ్‌ నగర్వా 34, బ్రాడ్‌ ఎవన్స్‌ 33 పరుగులు నాటౌట్‌ ఆకట్టుకోవడంతో ఆ జట్టు 189 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో దీపక్‌ చహర్‌, ప్రసిధ్‌ కృష్ణ, అక్షర్‌ పటేల్‌ తలా మూడు వికెట్లు తీయగా,.. సిరాజ్‌ ఒక వికెట్‌ తీశాడు. 

చదవండి: IND Vs ZIM: జింబాబ్వేతో తొలి వన్డే.. టీమిండియా రికార్డుల మోత

IND vs ZIM: వన్డేల్లో ధావన్‌ అరుదైన ఘనత.. సచిన్‌, గంగూలీ వంటి దిగ్గజాల సరసన!

మరిన్ని వార్తలు