వైస్‌ కెప్టెన్‌ అవుతానని ఊహించలేదు : రాహుల్‌

29 Oct, 2020 21:50 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. లీగ్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన రాహుల్‌ 595 పరుగులతో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఒక దశలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన పంజాబ్‌.. తర్వాత అనూహ్యంగా ఫుంజుకొని వరుసగా ఐదు విజయాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. కెప్టెన్‌ అనే పదానికి నిర్వచనం చెబుతూనే బ్యాట్సమెన్‌గా నిలకడగా రాణిస్తున్న రాహుల్‌ తాజాగా ఆస్ట్రేలియా టూర్‌కు అన్ని ఫార్మట్లలో ఎంపికయ్యాడు. కాగా రోహిత్‌శర్మ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌ వన్డే, టీ20 జట్లకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. (చదవండి : ఇలాంటి కీపర్‌ ఉంటే అంతే సంగతులు)

ఈ సందర్భంగా కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికవడం పట్ల స్పందించాడు.'ఆసీస్‌ టూర్‌లో టీమిండియాకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉంది. నా దృష్టిలో ఇది గర్వించదగిన విషయం. అసలు నేను వైస్‌ కెప్టెన్‌ అవుతానని ఊహించలేదు. ఈ  బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా.. నా వంతు బాధ్యతగా జట్టును విజయవంతగా నడిపించడానికి ప్రయత్నిస్తా. అని తెలిపాడు. అయితే వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌ ఎంపిక సంతోషమే అయినా.. అతని ముందున్న లక్ష్యం మాత్రం కింగ్స పంజాబ్‌ను చాంపియన్‌గా నిలపడమే. కింగ్స్‌ పంజాబ్‌ ఆడనున్న తదుపరి రెండు మ్యాచ్‌లు చాలా కీలకం. ఇప్పటికే పంజాబ్‌ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. కాగా కింగ్స్‌ పంజాబ్‌ రాజస్తాన్‌, సీఎస్‌కేలను ఎదుర్కోనుంది. (చదవండి : 'బయోబబుల్ నరకం.. కౌంట్‌డౌన్ మొదలెట్టా')

>
మరిన్ని వార్తలు