టెస్టు సిరీస్‌: కేఎల్‌ రాహుల్‌ అవుట్‌

5 Jan, 2021 10:56 IST|Sakshi
టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ‌(ఫొటో కర్టెసీ: బీసీసీఐ‌)

గాయపడిన కేఎల్‌ రాహుల్‌.. స్వదేశానికి పయనం

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు మరో టీమిండియా ఆటగాడు దూరమయ్యాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో శనివారం బ్యాటింగ్‌ ప్రాక్టీసు​ చేస్తున్న సమయంలో కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు.  అతడి ఎడమచేతి మణికట్టుకు గాయమైంది. దీంతో రాహుల్‌ స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ మిగిలిన రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని పేర్కొంది. రాహుల్‌ పూర్తిగా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందని, బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో అతడు చికిత్స పొందుతాడని తెలిపింది. (చదవండి: హమ్మయ్య! అందరికీ నెగెటివ్‌)

కాగా వన్డే సిరీస్‌లో మెరుగ్గా రాణించిన కేఎల్‌ రాహుల్‌(మొత్తంగా 93 పరుగులు).. పొట్టి ఫార్మాట్‌లో(81 పరుగులు)నూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇక తొలి రెండు టెస్టుల తుది జట్టులో అతడికి స్థానం దక్కకపోయినప్పటికీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న రాహుల్‌ శనివారం గాయపడ్డాడు. ఇక టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పితృత్వ సెలవుపై భారత్‌కు రాగా, స్టార్ బౌలర్లు మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌ గాయాల కారణంగా స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక మెల్‌బోర్న్‌ టెస్టుకు కోహ్లి, రోహిత్‌ శర్మ అందుబాలేకపోవడంతో రాహుల్‌ను ఆడించే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలించినప్పటికీ తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. ఇదిలా ఉండగా.. హిట్‌మాన్‌ రోహిత్‌ శర్మ ఇప్పటికే ఆసీస్‌కు చేరుకోగా.. ఉమేశ్‌ యాదవ్‌ స్థానాన్ని యువ పేసర్‌ నటరాజన్‌ భర్తీ చేశాడు. (చదవండి: అతడి తర్వాత మళ్లీ బుమ్రానే: అక్తర్‌)

మరిన్ని వార్తలు