రాహుల్‌ అవుట్‌

13 Feb, 2024 00:57 IST|Sakshi

గాయం నుంచి ఇంకా కోలుకోని భారత బ్యాటర్‌

దేవదత్‌ పడిక్కల్‌కు అవకాశం  

రాజ్‌కోట్‌: భారత సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్‌నెస్‌ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్‌ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ను ఎంపిక చేశారు.

‘రాహుల్‌ వందశాతం ఫిట్‌నెస్‌తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్‌కోట్‌ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్‌ టీమ్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్‌ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్‌కోట్‌లో జరుగుతుంది.

రాజ్‌కోట్‌కు ఇంగ్లండ్‌
స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు సోమవారం తిరిగి భారత్‌ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్‌కోట్‌ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీఏ) గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్‌ త్రయం హార్ట్‌లీ, రేహాన్‌ అహ్మద్, బషీర్‌లతో పాటు పార్ట్‌టైమ్‌ స్పిన్‌ పాత్ర పోషించే జో రూట్‌ అందుబాటులో ఉండటంతో లీచ్‌ స్థానంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు.     

whatsapp channel

మరిన్ని వార్తలు