'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది'

6 Jan, 2021 15:40 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆసీస్‌తో మూడో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న టీమిండియాకు యువ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ బుధవారం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ట్విటర్‌ వేదికగా టీమిండియాకు తన సందేశాన్ని అందించాడు. ' బ్యాడ్‌లక్‌.. గాయంతో స్వదేశానికి తిరుగుపయనం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో టీమిండియాను వదిలి రావడం కాస్త బాధ కలిగించింది. అయినా సరే మిగిలిన రెండు టెస్టులు భారత్‌ బాగా ఆడాలని కోరుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నా' అంటూ ట్వీట్‌ చేశాడు.

కాగా కేఎల్‌ రాహుల్‌ శనివారం(జనవరి 2న) మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తుండగా.. అతని ఎడమచేతి మణికట్టుకు గాయమైంది.  దీంతో రాహుల్‌ స్వదేశానికి చేరుకున్నాడు. కాగా రాహుల్‌ పూర్తిగా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందని, బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో అతడు చికిత్స పొందుతాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా వన్డే సిరీస్‌లో మెరుగ్గా రాణించిన కేఎల్‌ రాహుల్‌(మొత్తంగా 93 పరుగులు).. పొట్టి ఫార్మాట్‌లో(81 పరుగులు)నూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇక తొలి రెండు టెస్టుల తుది జట్టులో అతడికి స్థానం దక్కకపోయినప్పటికీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు.(చదవండి: 'ఛీ.. స్కూల్‌ లెవల్‌ కన్నా దారుణం')


మూడో టెస్టు​కు హనుమ విహారి స్థానంలో తుది జట్టులో ఉంటాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రాహుల్‌ గాయపడ్డాడు. ఇప్పటికే షమీ, ఉమేశ్‌లు గాయాలతో సిరీస్‌కు దూరమవగా.. తాజాగా రాహుల్ కూడా దూరమయ్యాడు. అయితే రోహిత్‌ శర్మ చేరికతో టీమిండియా జట్టు బలోపేతంగా కనిపిస్తుంది. జనవరి 7 నుంచి జరగనున్న మూడో టెస్టు కోసం నేడు బీసీసీఐ తుది జట్టు ప్రకటించగా.. మయాంక్‌ స్థానంలో రోహిత్‌ను ఎంపిక చేయగా.. నవదీప్‌ సైనీ తుది జట్టులోకి వచ్చాడు. 

మరిన్ని వార్తలు