IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్‌ రీ ఎంట్రీ

26 Dec, 2022 09:03 IST|Sakshi

2022 ఏడాదిని టీమిండియా విజయంతో ముగించింది. డాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన భారత్‌.. సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇక బంగ్లాపై విజయం సాధించిన టీమిండియా.. వచ్చే ఏడాదిని శ్రీలంకతో టీ20 సిరీస్‌తో ఆరంభించనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత జట్టు స్వదేశంలో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. జనవరి 3న ముంబై వేదికగా జరగనున్న తొలి టీ20తో శ్రీలంక జట్టు భారత పర్యటన ప్రారంభం కానుంది.

అయితే శ్రీలంక టీ20 సిరీస్‌కు టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, పంత్‌ దూరం కానున్నట్లు సమాచారం. అదే విధంగా భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేతి వ్రేలు గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. లంకతో టీ20 సిరీస్‌కు మాత్రం అతడికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. దీంతో మరోసారి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా జట్టు పగ్గాలు చేపట్టే ఆవకాశం ఉంది.

ఇక కేఎల్‌ రాహుల్‌ వచ్చే ఏడాది జ‌న‌వ‌రిలో తన ప్రేయసి అతియాశెట్టిని పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు లంకతో టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ తన నిర్ణయాన్ని ఇప్పటికే బీసీసీఐకు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక స్వదేశంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని విరాట్‌ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ స్ధానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోనే సూచనలు కన్పిస్తున్నాయి. 

ఇక గత కొంత కాలంగా జట్టుకు దూరం ఉన్న స్టార్‌ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా శ్రీలంక సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. అదే విధంగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అదరగొట్టిన యువ ఆటగాడు పృథ్వీ షా శ్రీలంక సిరీస్‌తో భారత జట్టులోకి రీంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  ఇక శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టును డిసెంబర్‌ 27న బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. 34 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా

మరిన్ని వార్తలు