ఫించ్‌ ఇక్కడేనా తగిలింది..!

29 Nov, 2020 18:08 IST|Sakshi

సిడ్నీ: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ను టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ఆటపట్టించే యత్నం చేశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా నవదీప్ సైనీ  వేసిన 12 ఓవర్‌ ఐదో బంతి బీమర్ ఫించ్ పొట్ట మీద తాకింది.  145.6 కి.మీ వేగంతో విసిరిన బంతి కాస్త గట్టిగా తాకడంతో ఫించ్ నొప్పితో బాధపడ్డాడు. వెంటనే సైనీ ఆసీస్‌కు కెప్టెన్‌కు సారీ చెప్పగా.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ చాహల్ బ్యాట్స్‌మెన్ దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. ఈ క్రమంలోనే ఫించ్‌ను రాహుల్‌ ఆటపట్టించాడు. దెబ్బ ఎక్కడ తాకింది..? పొట్ట మీదా లేదంటే కాస్త కిందా..?, బంతి ఇక్కడనే తాకింది.. అని నవ్వుతూ పొట్టను పట్టుకోయాడు. దానికి రిప్లైగా ఫించ్‌ తిరిగి రాహుల్‌  పొట్టపై పంచ్‌ విసిరాడు. దాంతో కాసేపు వారిద్దరూ నవ్వుకున్నారు. ఇది వైరల్‌ అయ్యింది

ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ పరాజయం చెందిన టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేను గెలిచిన ఆసీస్‌.. రెండో వన్డేలో కూడా విజయం సాధించింది. ఆసీస్‌ 51 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు