IND Vs AUS: 'అందమైన భార్య ఉన్నా ఇదే చెప్తావా?'

10 Feb, 2023 15:56 IST|Sakshi

నాగ్‌పూర్‌ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ఒక అభిమాని తన చర్యతో అందరిని ఆకట్టుకున్నాడు. విరాట్‌ కోహ్లి అంటే విపరీతమైన అభిమానం అనుకుంటా. కట్టుకున్న భార్య కంటే విరాట్‌ కోహ్లినే ఎక్కువ ఇష్టపడుతాను అంటూ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి కలిగించింది.

అయితే దీనిపై కొందరు అభిమానులు ఫన్నీ సెటైర్లు వేశారు.. ''బాగానే ఉంది సంబరం.. ఒకవేళ నీకు అందమైన భార్య ఉంటే అప్పుడు కూడా ఇలాగే చెప్తావా''.. ''ఇంటికెళ్లిన తర్వాత నీకు బడితపూజ ఖాయం భయ్యా''.. కోహ్లి మీద అభిమానంతో కట్టుకున్న భార్యను అవమానిస్తావా'' అంటూ కామెంట్స్‌ చేశారు. మరికొందరు మాత్రం గతంలో కోహ్లి సెంచరీ సాధించేంతవరకు పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చొన్న ఒక అభిమాని ఫోటోను రీట్వీట్‌ చేశారు. ఎంతైనా అభిమానం వెర్రిగానే ఉంటుంది. ముఖ్యంగా మన టీమిండియా ఫ్యాన్స్‌ అభిమానించడంలో ముందు వరుసలో ఉంటారు. సదరు క్రికెటర్‌ బాగా ఆడితే చప్పట్లు.. ఆడకపోతే చివాట్లు పెట్టడం సహజం. 

ఇక తొలి టెస్టు రసవత్తరంగా సాగుతుంది. తొలిరోజు టీమిండియా బౌలర్లు ఆసీస్‌ బ్యాటర్ల పని పడితే.. రెండోరోజు ఆటలో ఆసీస్‌ బౌలర్లు ఆధిపత్యం చూపిస్తు‍న్నారు. అయితే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో మెరవడం కాస్త ఊరటనిచ్చే అంశం. తన ఫామ్‌మై వస్తున్న విమర్శలకు సెంచరీతో సమాధానమిచ్చాడు రోహిత్‌. జట్టులో అంతా విఫలమైనప్పుడు ఆడడం తన స్పెషాలిటీ అని రోహిత్‌ మరోసారి నిరూపించాడు. 212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు రీఎంట్రీ టెస్టులో మొదట బౌలింగ్‌తో అదరగొట్టి ఐదు వికెట్లతో రాణించిన జడేజా.. బ్యాటింగ్‌లోనూ ఫిఫ్టీతో మెరిశాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. జడేజా 51, అక్షర్‌ పటేల్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో టాడ్‌ మర్ఫీ ఐదు వికెట్లతో చెలరేగాడు.

చదవండి: లియోన్‌ అనుకుంటే డెబ్యూ బౌలర్‌ ఇరగదీశాడు

మరిన్ని వార్తలు