కోహ్లిని చూసి సిగ్గు పడు.. ఐపీఎల్‌కు బుమ్రా ఇస్తున్న ప్రాధాన్యతపై ఫైర్‌ అవుతున్న ఫ్యాన్స్‌

21 Feb, 2023 18:44 IST|Sakshi

భారత పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాపై భారత క్రికెట్‌ అభిమానులు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. జాతీయ జట్టును కాదని ఐపీఎల్‌కు ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా ఫ్యాన్స్‌ ఫైరవుతున్నారు. ఐపీఎల్‌ ఆడటం కోసం జాతీయ జట్టు ప్రయోజనాలకు తాకట్టు పెట్టడమేంటని నిలదీస్తున్నారు. ఐపీఎల్‌పై అంత మోజు ఉంటే, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి, క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మాత్రమే ఆడుకోవాలని సూచిస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండబట్టి 8 నెలలు పూర్తవుతున్నా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు. బుమ్రాను జాతీయ జట్టుకు ఆడించే విషయంలో బీసీసీఐ కూడా డ్రామాలు ఆడుతుందని దుయ్యబడుతున్నారు. పైకి వన్డే వరల్డ్‌కప్‌ను సాకుగా చూపిస్తూ.. లోలోపల బుమ్రా ఫిట్‌గా ఐపీఎల్‌లో పాల్గొనేందుకు బీసీసీఐ పెద్దలు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

బీసీసీఐ ప్రమేయం లేనిదే గాయం బూచి చూపిస్తూ ఇన్నాళ్లు ఇష్టారీతిన వ్యవహరించగలడా అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్‌కు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లిని చూసి బుమ్రా సిగ్గు పడాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. BGTలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌ సందర్భంగా కోహ్లి ప్రవర్తించిన తీరును ఉదాహరణగా చూపిస్తూ.. దేశానికి కోహ్లి ఇచ్చే ప్రాధాన్యత ఇది, కోహ్లిని చూసి నేర్చుకో అంటూ సలహాలిస్తున్నారు.

కాగా, ఢిల్లీ టెస్ట్‌ మూడో రోజు ఆటలో విరాట్‌ కోహ్లి స్లిప్‌్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన కోహ్లి వారిని వారించి, ఆర్సీబీ అని కాకుండా ఇండియా.. ఇండియా అని తమను ఎంకరేజ్‌ చేయాలంటూ తన జెర్సీపై ఉన్న బీసీసీఐ ఎంబ్లెంని చూపిస్తూ ఫ్యాన్స్‌కు సైగ చేశాడు.

కోహ్లి ఇలా చెప్పాడో లేదో.. ఇండియా.. ఇండియా.. అకే కేకలతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది.  ఇదిలా ఉంటే, వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న బుమ్రా గతేడాది జులై 1న తన చివరి టెస్ట్‌, జులై 14న చివరి వన్డే, సెప్టెంబర్‌ 25న ఆఖరి టీ20 మ్యాచ్‌ ఆడాడు.  నాటి నుంచి ఆ సాకు ఈ సాకు చూపిస్తూ, జట్టులోకి వస్తూ, పోతూ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకే పరిమితమయ్యాడు.

మరిన్ని వార్తలు