కోహ్లీ మాటతప్పాడు.. సిరాజ్‌ అభిమానుల ఆగ్రహావేశాలు

18 Jun, 2021 18:00 IST|Sakshi

సౌతాంప్టన్: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ విషయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట తప్పాడని సిరాజ్‌ అభిమానులు మండిపడుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సిరాజ్‌కు అవకాశం కల్పిస్తానని చెప్పి మొండి చెయ్యి చూపాడని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరాజ్ మంచి ఫామ్‌లో ఉన్నా.. స్వింగ్ చేయగల సత్తా ఉన్నా.. జట్టు యాజమాన్యం ఇషాంత్‌కు ఓటేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరే ముందు జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ, కోచ్‌ రవి శాస్త్రి మాట్లాడుకుంటూ.. న్యూజిలాండ్ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయాలంటే మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లను రౌండ్ ద వికెట్ బౌలింగ్‌ చేయించాలని డిస్కస్‌ చేశారు. దీంతో సిరాజ్ తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడని అంతా భావించారు.

పైగా ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో స్వింగ్ బౌలర్‌గా అతను కీలకం అవుతాడని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డాడు. కానీ కోహ్లీ అండ్ కో.. పిచ్‌పై బౌన్స్ ఉంటుందన్న క్యూరేటర్ మాటల ఆధారంగా ఇషాంత్‌కు అవకాశం ఇచ్చారు. ఇక ఇషాంత్ ఇదే తన చివరి ఇంగ్లండ్‌ పర్యటన కావచ్చని మీడియాలో వెల్లడించడాన్ని కూడా జట్టు యాజమాన్యం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇషాంత్‌ గత ఇంగ్లండ్‌ పర్యటనలో 18 వికెట్లతో సత్తా చాటిన విషయాన్ని కూడా పరిశీలించి ఆతర్వాతనే తుది జట్టులోకి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా, నిన్ననే ప్రకటించిన భారత తుది జట్టులో హైదరాబాదీ సిరాజ్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌కు అవకాశం దక్కింది.

కాగా, వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడటం తన కల అని ఇటీవల సిరాజ్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకి మించి రాణించిన సిరాజ్.. భారత్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆతర్వాత జరిగిన ఐపీఎల్‌లోనూ అతను సత్తా చాటాడు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోని టీమిండియా యాజమాన్యం సిరాజ్‌ను పక్కకు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు సిరాజ్‌కు అండగా నిలుస్తున్నారు. సిరాజ్‌కు మంచి భవిష్యత్తు ఉందని భరోసా ఇస్తున్నారు. మరికొందరు మాత్రం టీమ్ బాగుందని, మంచి బ్యాలెన్స్‌తో ఉందని కామెంట్ చేస్తున్నారు.

చదవండి: WTC Final: అలా ఎలా డిసైడ్‌ చేస్తారు, అది తప్పు: కోహ్లీ

మరిన్ని వార్తలు