IND vs ZIM: 'జింబాబ్వేపై కోహ్లి సెంచరీ చేసినా.. అతడి ఫామ్‌లో మార్పు రాదు'

29 Jul, 2022 15:57 IST|Sakshi

టీమిండియా ప్రస్తుతం కరీబియన్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత్‌.. శుక్రవారం(జూలై29) నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో కూడా తమ అధిపత్యం చెలాయించాలని భావిస్తోంది. ఇక విండీస్‌తో టీ20 సిరీస్‌ అనంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌లో జింబాబ్వేతో తలపడనుంది.

హరారే వేదికగా ఆగస్టు 18న జరగున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. మరోవైపు ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ జరగనుండడంతో జింబాబ్వే పర్యటనకు భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే అవకాశం ఉంది. అయితే విండీస్‌ పర్యటనకు దూరంగా ఉన్న భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లిని జింబాబ్వే సిరీస్‌లో భాగం చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కోహ్లి గత కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనకు కోహ్లిని పంపిస్తే ఫామ్‌లోకి వస్తాడని, సెంచరీ కూడా సాధిస్తాడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమచారం. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. జింబాబ్వే వంటి జట్టుపై కోహ్లి సెంచరీ చేసినా అతడి ఫామ్‌లో ఎటువంటి మార్పు ఉండదని స్టైరిస్ తెలిపాడు.

"జింబాబ్వే పర్యటనకు కోహ్లిని పంపడం వల్ల అతడికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. టీ20 ప్రపంచకప్‌ సమయానికి కోహ్లి సన్నద్దంగా ఉండేలా టీమిండియా యాజమాన్యం చర్యలు తీసుకుకోవాలి. అయితే చాలా మంది జింబాబ్వేతో సిరీస్‌లో కోహ్లి ఆడాలని భావిస్తున్నారు. అయితే జింబాబ్వే సిరీస్‌లో అతడు ఆడడం వల్ల ఎటువంటి ఊపయోగం లేదు. జింబాబ్వేపై కోహ్లి అలవోకగా సెంచరీ సాధించగలడు. కానీ అతడి ఫామ్‌లో ఎటువంటి మార్పు రాదు. కోహ్లి తన ఫామ్‌ను తిరిగి పొందాలంటే కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలి" అని స్టైరిస్ పేర్కొన్నాడు.
చదవండి: SL Vs PAK 2nd Test: ఒకటీ అరా గెలిచి.. ఏదో పొడిచేసినట్లు విర్రవీగడం! పాక్‌ జట్టుకు..

మరిన్ని వార్తలు