21 ఏళ్లు క్రికెట్‌ను మోశాడు.. అందుకే ఎత్తుకున్నాం

29 Jul, 2020 16:35 IST|Sakshi

ముంబై : 2011లో సొంత‌గ‌డ్డ‌పై శ్రీలంక‌తో జ‌రిగిన ఫైన‌ల్లో టీమిండియా విజ‌యం సాధించి 28 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ రెండోసారి స‌గ‌ర్వంగా ప్ర‌పంచ‌క‌ప్పును అందుకుంది. ధోనీ విన్నింగ్ సిక్స‌ర్ కొట్ట‌డంతో దేశ‌మంతా సంబరం చేసుకుంది. ఇక మైదానంలో భారత ఆటగాళ్ల ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను యువ ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకొని మైదానమంతా కలియతిరిగారు.(బ్రాడ్‌ను మ‌న‌స్పూర్తిగా అభినందించండి : యూవీ)

అయితే అప్ప‌టికే మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ 5 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో పాల్గొన్నాడు. 2011లో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ స‌చిన్‌కు ఆరోది. అప్ప‌టికే రెండుసార్లు ప్ర‌పంచ‌క‌ప్ చిక్కిన‌ట్లే చిక్కి(1996,2003) చేజారిపోయింది. ఈసారి కాక‌పోతే మ‌ళ్లీ ఆ అవ‌కాశం రాక‌పోవ‌చ్చు అని స‌చిన్ భావించాడు. జ‌ట్టులోని ఆట‌గాళ్లు కూడా స‌చిన్ కోస‌మైనా ఈ అవ‌కాశం ఉప‌యోగించుకోవాలి.. ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వాలనుకున్నారు. చివ‌రికి అనుకున్న‌ది సాధించారు. తాజాగా నాటి జట్టులో సభ్యుడైన ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సచిన్‌ను అలా భుజాలపై ఎత్తుకోవడానికి గల కారణాన్ని  వెల్లడించాడు. 'ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ ‌పేరుతో మయాంక్ అగర్వాల్ నిర్వహించిన చాట్‌షోలో పాల్గొన్న కోహ్లీ స‌చిన్ ఎపిక్ మూమెంట్స్‌ను షేర్ చేసుకున్నాడు. (అతనికి డబుల్‌ సెంచరీలు చేయడం తెలీదు: కపిల్‌ దేవ్‌)

‘2011 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఎప్ప‌టికి గుర్తుండిపోతుంది.  ఆరోజు నాకు కలిగిన సంతోషాన్ని మాట‌ల్లో చెప్ప‌లేక‌పోయా. అందుకే లెజెండ్ స‌చిన్ పాజీని భుజానికెత్తుకున్న ఫొటో ఎప్పుడూ చూసినా సరే గర్వంగా అనిపిస్తుంది. ఆ మ్యాచ్ గెల‌వ‌డంతో మేము వరల్డ్ చాంపియన్స్ అయ్యాము. ఆ సమయంలో తెలియకుండానే జట్టంతా సచిన్ చుట్టూ చేరింది. ఎందుకంటే అది సచిన్‌కు చివరి వరల్డ్‌కప్ అని మా అందరికీ తెలుసు. పాజీ దేశానికి ఎంతో చేశాడు. అలాంటి వ్యక్తికి మేమిచ్చిన గిఫ్ట్ వరల్డ్‌కప్. అతను భారత క్రికెట్‌ను 21 ఏళ్లుగా మోసాడు. అందుకే ఆ క్షణాన మేం అతన్ని మా భుజాలపై ఎత్తుకున్నాం. తనదైనా ఆటతో దేశంలోని చాలామంది పిల్లలకు స్పూర్తిదాయకంగా నిలిచాడు. వారందరి తరఫున సచిన్‌కు మేం ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. ఎందుకంటే కొన్నేళ్లుగా సచిన్ భారత్‌కు ఎన్నో ఇచ్చాడు. ఇస్తూనే ఉన్నాడు. తన స్వస్థలంలో సచిన్ కల నెరవేరిందని మేమంతా భావించాం. అందుకే గౌరవ సూచకంగా భుజాలపై ఎత్తుకున్నాం.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

>
మరిన్ని వార్తలు