పంత్‌ వద్దన్నా వినలేదు, సిరాజ్‌ మాట విన్నాడు.. మూల్యం చెల్లించుకున్నాడు

14 Aug, 2021 13:23 IST|Sakshi

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్సాహం మరోసారి టీమిండియా పాలిట శాపంలా మారింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో వికెట్‌ కీపర్‌ పంత్‌ ఎంత చెప్పినా వినకుండా రివ్యూ తీసుకొని వృథా చేశాడు. దాంతో భారత కెప్టెన్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ ఎప్పుడూ ఇలానే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జట్టు విజయావకాశాలను దెబ్బ తీస్తాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఇన్నింగ్స్ 23వ ఓవర్ వేసిన సిరాజ్.. నాలుగో బంతిని లైన్ అండ్‌ లెంగ్త్‌తో వికెట్లపైకి విసిరాడు. బంతిని డిఫెన్స్ చేసేందుకు రూట్ ప్రయత్నించగా.. అది కాస్తా బ్యాట్‌కి దొరకకుండా ఫ్యాడ్‌ని తాకుతూ వెళ్లింది. దాంతో టీమిండియా ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా.. అంపైర్ తిరస్కరించాడు. అయితే, బంతి కచ్చితంగా వికెట్లను తాకేలా కనిపించిందని సిరాజ్ చెప్పడంతో కోహ్లీ రివ్యూ తీసుకోవాలని భావించాడు. ఈ విషయమై పంత్ మాత్రం సిరాజ్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. బంతి లెగ్ స్టంప్‌కు బయటగా వెళ్తోందని కోహ్లీతో వాదించాడు. 

రివ్యూ వద్దని పంత్ ఎంత వారిస్తున్నా వినని కోహ్లీ.. సరదాగా నవ్వుకుంటూనే రివ్యూకి వెళ్లాడు. తీరా అందులో నాటౌట్‌గా తేలడంతో భంగపడ్డాడు. దీంతో కోహ్లీపై నెటిజన్లు ఫైరవుతున్నారు. సిరాజ్‌పై గుడ్డి నమ్మకంతో కొంప ముంచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రివ్యూ తీసుకునే విషయంలో ధోని వద్ద కోచింగ్ తీసుకుంటే బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌.. సిరాజ్‌పై సెటైర్‌ విసిరాడు. డీఆర్ఎస్ అంటే " డోంట్ రివ్యూ సిరాజ్" అంటూ ట్వీట్ చేశాడు.  కాగా, ఇటీవల కాలంలో పంత్‌ చాలా వరకూ డీఆర్‌ఎస్‌ కోరడంలో కోహ్లీకి సాయపడుతున్నాడు. కానీ.. లార్డ్స్‌లో పంత్ అభిప్రాయాన్ని పక్కనపెట్టిన కోహ్లీ.. సిరాజ్‌‌పై గుడ్డి నమ్మకంతో డీఆర్‌ఎస్ తీసుకొని మూల్యం చెల్లించుకున్నాడు.

ఇదిలా ఉంటే, ఓవర్‌నైట్‌ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌.. ఆండర్సన్‌(5/62) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, సిక్స్‌) మరో 2 పరుగులు మాత్రమే జోడించి ఔటవ్వగా.. మిగితా జట్టంతా పేకమేడలా కూలింది. 86 పరుగుల వ్యవధిలో భారత్‌.. తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. పంత్‌(37), జడేజా(40) పర్వాలేదనిపించగా.. రహానే(1) మరోసారి నిరాశపరిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్‌(2/34) దెబ్బతీయగా, బర్న్స్‌(49), రూట్‌(48 బ్యాటింగ్‌) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. 

>
మరిన్ని వార్తలు