20 పరుగులకే ఔట్‌.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో టవల్‌ విసిరి కొట్టిన కోహ్లి, వైరల్‌

16 Aug, 2021 11:55 IST|Sakshi

లండన్‌: లార్డ్స్ టెస్టు 4వ రోజు విరాట్ కోహ్లీ 20 పరుగులకే వెనుదిరిగాడు. అయితే దీనిపై కోహ్లీ తన నిరాశను ప్రదర్శిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లో టవల్‌ను విసిరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై కొంత మంది నెటిజన్లు కోహ్లీకి మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు ట్రోల్‌ చేస్తూ కామెంట్‌ చేస్తున్నారు. 

కోహ్లీ వరుసగా ఏడు ఇన్నింగ్స్‌లలో యాభై పరుగులు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఇక కోహ్లీ స్కోర్లు వరుసగా 0, 62, 27, 0, 44,13, 0, 42, 20 గా ఉన్నాయి. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ.. ‘‘కోహ్లీ! ఎంత సమయమైన తీసుకో.. కానీ మళ్లీ నీ ప్రతాపం చూడాలి. నీ ఆటతో విమర్శించే వాళ్ల నోళ్లు మూయించాలి. దాని కోసం నేను వేచి ఉంటాను.’’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

కాగా భారత ఓపెనింగ్‌ జోడీ రాహుల్‌–రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మార్క్‌ వుడ్‌ పేస్‌కు టీమిండియా బ్యాటింగ్‌ దళం వణికింది. 27 పరుగుల లోటుతో మొదలైన భారత రెండో ఇన్నింగ్స్‌ను ఈ ఇంగ్లండ్‌ సీమర్‌ దెబ్బ మీద దెబ్బ తీశాడు. వుడ్‌ తన వరుస ఓవర్లలో రాహుల్‌ (5), రోహిత్‌ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌)లను పెవిలియన్‌ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి.

పుజారాకు కెప్టెన్‌ కోహ్లి జతయ్యాడు. కానీ ఈ జోడీ ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్‌ కరన్‌ ఔట్‌ చేశాడు. క్రీజులోకి రహానే రాగా... ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్‌ వుడ్‌ మళ్లీ కుదుపేశాడు. పుజారాను ఔట్‌ చేశాడు. తర్వాత మొయిన్‌ అలీ స్వల్ప వ్యవధిలో రహానే పోరాటానికి చెక్‌ పెట్టి... రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్‌ చేశాడు. మూడో సెషన్‌లో కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 5; రోహిత్‌ (సి) మొయిన్‌ అలీ (బి) వుడ్‌ 21; పుజారా (సి) రూట్‌ (బి) వుడ్‌ 45; కోహ్లి (సి) బట్లర్‌ (బి) స్యామ్‌ కరన్‌ 20; రహానే (సి) బట్లర్‌ (బి) మొయిన్‌ అలీ 61; పంత్‌ (బ్యాటింగ్‌) 14; జడేజా (బి) మొయిన్‌ అలీ 3; ఇషాంత్‌ (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (82 ఓవర్లలో 6 వికెట్లకు) 181.
వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175.
 

మరిన్ని వార్తలు