సింధు, శ్రీకాంత్‌లకు కాంస్యం.. వ్రిత్తికి రజతం.. షూటౌట్‌లో భారత్‌కు ఓటమి!

10 Apr, 2022 09:29 IST|Sakshi

కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్స్‌ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో  సింధు 14–21, 17–21తో ఆన్‌ సెయంగ్‌ (కొరియా) చేతిలో ఓడిపోయింది.

ఇక పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో శ్రీకాంత్‌ 19–21, 16–21తో జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. సెమీఫైనల్లో ఓడిన సింధు, శ్రీకాంత్‌లకు 5,220 డాలర్ల (రూ. 3 లక్షల 96 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. 

ఇతర క్రీడా వార్తలు..
వ్రిత్తి అగర్వాల్‌కు రజతం

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాఫ్రికా ఓపెన్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ యువ స్విమ్మర్‌ వ్రిత్తి అగర్వాల్‌ రజతం పతకం సాధించింది. అండర్‌–16 బాలికల ఫ్రీస్టయిల్‌ 1500 మీటర్ల విభాగం ఫైనల్‌ రేసును వ్రిత్తి 18 నిమిషాల 06.40 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది.

‘షూటౌట్‌’లో భారత్‌ ఓటమి 
భువనేశ్వర్‌: అంతర్జాతీయ హాకీ సమాఖ్య మహిళల ప్రొ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సవిత కెప్టెన్సీలోని భారత జట్టు ‘షూటౌట్‌’లో 1–3తో ఓడిపోయింది. ఆట తొలి నిమిషంలో రజ్విందర్‌ కౌర్‌ గోల్‌తో భారత్‌ ఖాతా తెరువగా... 53వ నిమిషంలో కెప్టెన్‌ జాన్సెన్‌ యిబ్బి గోల్‌తో నెదర్లాండ్స్‌ స్కోరును 1–1తో సమం చేసింది.

విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ నిర్వహించగా... భారత్‌ తరఫున నవనీత్‌ కౌర్‌ మాత్రమే సఫలంకాగా రజ్విందర్, నేహా, జ్యోతి విఫలమయ్యారు. నెదర్లాండ్స్‌ జట్టు తరఫున మరాంటె, ఫోర్టిన్‌ కిరా, జాన్సెన్‌ సఫలంకాగా... ఫియోనా విఫలమైంది.

చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్‌ అయినా గెలవండిరా బాబూ! సిగ్గుతో చచ్చిపోతున్నాం! 

మరిన్ని వార్తలు