KPL Case: "మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నేరం కాదు.." కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

22 Jan, 2022 19:13 IST|Sakshi

Match Fixing Not Punishable Says Karnataka High Court: క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నేరం కాదని, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం శిక్షార్హం కూడా కాదని ఆదేశించింది. 2019 కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) ఫిక్సింగ్ కేసుకు సంబంధించి ఈ తీర్పును వెల్లడించింది. జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్‌ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. కేసును కొట్టి వేస్తూ, దోషులను శిక్షించడం బీసీసీఐ అధికార పరిధిలోకి వస్తుందని పేర్కొంది. 

నిందితులపై సెక్షన్‌ 420 కింద కేసు నమోదు చేయడం కరెక్ట్‌ కాదని, ఐపీసీ ప్రకారం వీరికి చీటింగ్‌ కేసు వర్తించదని వివరించింది. ఓ ఆటగాడు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడితే.. క్రీడను అమితంగా అభిమానించే ప్రేక్షకులను మోసం చేశాడన్న భావన కలగడం సహజమని, అయితే దీన్ని పరిగణలోకి తీసుకుని నిందితులను శిక్షించే హక్కు కోర్టుకు లేదని, ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకునే అధికారం సంబంధిత క్రికెట్‌ బోర్డులకే ఉంటుందని స్పష్టం చేసింది. 

కాగా, 2019 కేపీఎల్‌ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి భారీ ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పలువురు ఆటగాళ్లు, జట్ల యజమానులు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి సహా ఓ బుకీపై బెంగళూరు పోలీసులు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. వీరిలో సిఎం గౌతమ్ (ప్లేయర్, ఏ1), అబ్రార్ ఖాజీ (ప్లేయర్, ఏ2), అలీ అష్పక్ (బెల్గావి పాంథర్స్ యజమాని, ఏ3), అమిత్ మావి (బుకీ, ఏ4) ప్రధాన నిందితులుగా ఉన్నారు. 
చదవండి: కోహ్లికి షోకాజ్‌ నోటీసులు.. స్పందించిన గంగూలీ

మరిన్ని వార్తలు