క్రిచికోవా ‘డబుల్‌’ ధమాకా

14 Jun, 2021 03:03 IST|Sakshi
డబుల్స్‌ ట్రోఫీతో సినియకోవా, క్రిచికోవా

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ కూడా సొంతం

‘డబుల్‌’ సాధించిన ఏడో క్రీడాకారిణిగా ఘనత

పారిస్‌: ఐదో ప్రయత్నంలోనే తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ చాంపియన్‌గా అవతరించిన చెక్‌ రిపబ్లిక్‌ అమ్మాయి బర్బోర క్రిచికోవా 24 గంటలు గడవకముందే తన ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను జమ చేసుకుంది. శనివారం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన 25 ఏళ్ల క్రిచికోవా ఆదివారం మహిళల డబుల్స్‌ టైటిల్‌ను కూడా దక్కించుకుంది.

ఫైనల్లో క్రిచికోవా –కాటరీనా సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌) ద్వయం 6–4, 6–2తో బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా) –ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన క్రిచికోవా జంటకు 2,44,925 యూరోలు (రూ. 2 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విడుదలయ్యే ప్రపంచ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో క్రిచికోవా ఏడో ర్యాంక్‌ నుంచి నంబర్‌వన్‌ ర్యాంక్‌కు ఎగబాకనుంది.  

‘డబుల్‌’ విజయంతో క్రిచికోవా దిగ్గజ క్రీడాకారిణిల సరసన నిలిచింది. సెరెనా (2016 వింబుల్డన్‌లో) తర్వాత ఓ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన క్రీడాకారిణగా క్రిచికోవా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఈ తరహా ఘనత సాధించిన ఏడో క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. గతంలో బిల్లీ జీన్‌ కింగ్‌ (1972), మార్గరెట్‌ కోర్ట్‌ (1973), క్రిస్‌ ఎవర్ట్‌ (1974, 1975), వర్జీనియా(1978), మార్టినా నవ్రతిలోవా (1982, 1984), మేరీ పియర్స్‌ (2000) ఈ ఘనత సాధించారు.

మరిన్ని వార్తలు