Ind Vs Eng: అయ్యో పాపం సూర్య, ఏదీ అంత తేలికగా దొరకదు!

27 Jul, 2021 17:41 IST|Sakshi

వెబ్‌డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున మెరుగైన ప్లేయర్‌గా గుర్తింపు... సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌తో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం... ప్చ్‌.. అయినా రెండుసార్లు బెంచ్‌కే పరిమితం.. ముచ్చటగా మూడోసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. అడుగుపెట్టగానే  సిక్సర్‌తో మొదలెట్టి 28 బంతుల్లోనే అర్థసెంచరీతో రికార్డు... ఇక ప్రస్తుత శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డేల్లోనూ అరంగేట్రం... ప్రతిభ ఆధారంగానూ, ఇంగ్లండ్‌ ప్రస్తుత సిరీస్‌కు ఎంపికైన ఇతర క్రికెటర్లు గాయాల బారిన పడటం మూలాన.. టెస్టుల్లోనూ అరంగేట్రం చేసే అవకాశం.. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.. అవును టీమిండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ గురించే ఈ ఉపోద్ఘాతం. 

అన్నీ సజావుగా సాగితే.. సూర్య.. కోహ్లి కెప్టెన్సీలో సంప్రదాయ క్రికెట్‌లో అడుగుపెట్టడం ఖాయం అని ఫ్యాన్స్‌ సంబరపడి పోతున్న సమయం. ఇంతలోనే కృనాల్‌ పాండ్యాకు కరోనా సోకిందన్న వార్త అభిమానులను కలవరపెడుతోంది. అతడితో పాటు సూర్యకుమార్‌, పృథ్వీ షా కూడా ఒకే గదిలో ఉండటమే ఇందుకు కారణం. కాబట్టి వీరిద్దరి ఇంగ్లండ్‌ ప్రయాణం సందిగ్ధంలో పడిపోయింది. ఒకవేళ నెగటివ్‌ వచ్చినా..  ఆగష్టు 4 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌ నాటికి అక్కడికి చేరుకుని క్వారంటైన్‌ పూర్తి చేసుకునే అవకాశం లేదు. దీంతో వీరిద్దరి స్థానంలో టెస్టు సిరీస్‌కు వేరే ఆటగాళ్లను ఎంపిక అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

నీదైన రోజు నిన్నెవరూ ఆపలేరు
ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘‘అయ్యో పాపం సూర్య. నీకు ఏదీ అంత తేలికగా దక్కదు. అయినా నీదైన రోజు నువ్వు చెలరేగి ఆడగలవు. ఏదేమైనా కృనాల్‌ పాండ్యాకు కరోనా సోకడం.. ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న రెండో టీ20ను వాయిదా వేయడంతో పాటుగా...  సూర్య, పృథ్వీ ఇంగ్లండ్‌ పయనానికి ఎసరు పెట్టింది. చూడాలి మరి.. ఏం జరుగుతుందో’’ అంటూ క్రికెట్‌ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక టీ20 మ్యాచ్‌ వాయిదాపై స్పందించిన టీమిండియా మాజీ ప్లేయర్‌ వసీం జాఫర్‌.. ‘‘కృనాల్‌ త్వరగా కోలుకోవాలి. ఆటగాళ్లంతా సురక్షితంగా ఉండాలి’’ అని ప్రార్థించాడు. ఇందుకు స్పందనగా.. ‘‘కృనాల్‌ ఓకే.. కానీ సూర్య, పృథ్వీ పరిస్థితి ఏంటో.. చేతిదాకా వచ్చిన అవకాశం చేజారుతుందేమో’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక కృనాల్‌ దూకుడైన ఆటిట్యూడ్‌ నచ్చని వారు.. ‘‘ఇదిగో ఇప్పుడు కృనాల్‌ ఇలాగే కరోనాను కూడా భయపెడతాడు చూడండి.

ఏదేమైనా ఐసోలేషన్‌లో పెట్టినా పాండ్యా బ్రదర్స్‌ అంత తేలికగా సుతరాయించరు’’ అంటూ ఫన్నీ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో కృనాల్‌ ఒక వికెట్‌ తీయగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. ఇక పృథ్వీ షా అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు