నాన్నకు ప్రేమతో.. కృనాల్‌ ఏం చేశాడో తెలుసా..?

24 Mar, 2021 19:16 IST|Sakshi

పూణే: ఇంగ్లండ్‌తో తొలి వన్డే ద్వారా వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి, అదిరిపోయే ప్రదర్శనతో(31 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు, 10 ఓవర్లలో 1/59) ఆకట్టుకున్న కృనాల్‌ పాండ్యా.. తన తండ్రి పట్ల ఉన్న ఎమోషన్‌ను ఆపుకోలేకపోతున్నాడు. తమ్ముడు హార్ధిక్‌ నుంచి వన్డే క్యాప్‌ అందుకునే సమయంలో తొలుత భావోద్వేగానికి లోనైన కృనాల్‌.. ఆతరువాత ప్రజెంటేషన్‌ వేదిక వద్ద కన్నీలను ఆపుకోలేకపోయాడు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత మాట్లాడే ప్రయత్నం చేసినా.. అతను భావోద్వేగాన్ని కంట్రోల్‌ చేసుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. తన ప్రదర్శన తండ్రికి అంకితమంటూ భావోద్వేగ ప్రకటన చేశాడు. 

ఇదిలా ఉండగా తొలి వన్డేలో విజయం అనంతరం హార్దిక్, తన సోదరుడు కృనాల్‌ను ఇంటర్వ్యూ చేయగా, ఆ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా పాండ్య సోదరులిరువురు మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. తమ తండ్రి తమతో లేకపోయినా ఆయన ధరించాలనుకున్న దుస్తులు తమతో పాటు డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాయని, తమ తండ్రి మ్యాచ్‌ను చూడలేకపోయినా ఆయన దుస్తులైనా ఆ అనుభూతిని పొందుతాయని వారు సంతోషం వ్యక్తం చేశారు. 

హార్దిక్‌ నుంచి క్యాప్‌ అందుకోవడం చూసి నాన్న సంతోషించే ఉంటారని కృనాల్‌ పేర్కొనగా... "మన జీవిత కాలంలో తొలిసారి నాన్న డ్రస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చారు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. మన ఇద్దరి తరఫున నువ్వు అద్భుతంగా ఆడి, నాన్నకు ముందుగానే పుట్టినరోజు కానుక ఇచ్చావంటూ" హార్దిక్‌ భావోద్వేగం చెందాడు. కాగా, ఈ ఏడాది జనవరి 16న పాండ్యా సోదరుల తండ్రి హిమాన్షు పాండ్యా(71) కార్డియాక్‌ అరెస్ట్‌తో మృతి చెందాడు. కృనాల్‌.. తన తండ్రి దుస్తుల సంచీని బరోడా నుంచి పూణేకు తీసుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం ఆటగాళ్లు(కృనాల్‌, ప్రసిద్ద్‌ కృష్ణ(4/54)) అద్భుతంగా రాణించడంతో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం(మార్చి 26న) జరుగనుంది.
చదవండి: భావోద్వేగానికి లోనైన కృనాల్‌ పాండ్యా

మరిన్ని వార్తలు