Krunal Pandya: కృనాల్‌ ఖాతాలో పలు రికార్డులు

23 Mar, 2021 19:08 IST|Sakshi

పూణే: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అరంగేట్రం ఆటగాడు కృనాల్‌ పాండ్యా(31 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కర్ణాటక పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణతో కలిసి టీమిండియా వన్డే క్యాప్‌ను అందుకున్న ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌.. క్లిష్ట సమయంలో(40.3 ఓవర్లలో 205/5 స్కోర్‌ వద్ద) క్రీజ్‌లోకి వచ్చి ఇంగ్లండ్‌ బౌలర్లను చీల్చిచెండాడు. ఈ క్రమంలో అతను ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 112 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ ముంబై ఇండియన్స్‌ ఆటగాడు.. 26 బంతుల్లోనే అర్ధశతకాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో అరంగేట్రంలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌ ఆటగాడు జాన్‌ మోరిస్‌(35 బంతుల్లో) పేరిట నమోదై ఉంది.

దీంతోపాటు తొలి వన్డే మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ నమోదు చేసిన 15వ భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నమోదు చేశాడు. అలాగే 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్‌ సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో కృనాల్‌కు తోడుగా మరో ఎండ్‌లో రాహుల్‌(43 బంతుల్లో 62; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సైతం భారీ షాట్లతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 317 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. తొలుత ధవన్‌(98), కోహ్లి(56) అర్ధశతకాలతో రెచ్చిపోగా, ఆఖర్లో రాహుల్‌, కృనాల్‌ ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేశారు. కాగా, ఈ మ్యాచ్‌ ఆరంభంలో తమ్ముడు హార్దిక్‌ నుంచి వన్డే క్యాప్‌ అందుకున్న కృనాల్‌.. తన తండ్రిని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు.

చదవండి: 
భావోద్వేగానికి లోనైన కృనాల్‌ పాండ్యా

ధవన్‌ ఖాతాలో అరుదైన రికార్డు..

మరిన్ని వార్తలు