మీ ఆటకు ఫిదా.. అవేవి మిమ్మల్ని ఆపలేదు

12 Jan, 2021 17:15 IST|Sakshi

సిడ్నీ: ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్‌ ఓటమి నుంచి తప్పించుకోవడంలో హనుమ విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌ చూపించిన తెగువపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఆసీస్‌ పేసర్ల బౌన్సర్లు వీరిని కలవరపెట్టినా ఏ మాత్రం బెదరకుండా ఇ‍న్నింగ్స్‌ ఆడిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. కాగా విహారీ, అశ్విన్‌ల ఆటతీరుపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించాడు. (చదవండి: దుమ్మురేపిన జడేజా.. అగ్రస్థానంలో విలియమ్సన్‌)

'నిజంగా నిన్న అద్భుతమైన టెస్టు మ్యాచ్‌ చూశా! విహారి, అశ్విన్‌లిద్దరు ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్‌ కొనసాగించిన తీరుకు ఫిదా అయ్యా. ఆటలో భాగంగా ఆసీస్‌ బౌలర్ల నుంచి పదునైన బౌన్సర్లతో గాయాలవుతున్న అవేవి మిమ్మల్ని ఆపలేదు.. పైగా ఓటమిని దరిచేయకుండా అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడారు. మ్యాచ్‌ను డ్రా చేయాలనే మీ సంకల్ప దృడత్వాన్ని ఇక మీదట అలాగే కొనసాగించండి. మ్యాచ్‌ విజయం కన్నా డ్రాగా ముగించడం మరింత ఆనందాన్నిచ్చింది.'అంటూ తెలిపారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్‌; 4 ఫోర్లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (128 బంతుల్లో 39 నాటౌట్‌; 7 ఫోర్లు)ల మారథాన్‌ భాగస్వామ్యంతో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్‌లో నిలిచి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఆసీస్‌ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు. మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన స్టీవ్‌ స్మిత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది. (చదవండి: బుమ్రా ఔట్‌.. డైలమాలో టీమిండియా)

మరిన్ని వార్తలు