Asia Cup 2022: 'దీపక్‌ చహర్‌ గాయపడలేదు.. ఆ వార్తలు నమ్మకండి'

25 Aug, 2022 17:47 IST|Sakshi
దీపక్‌ చహర్‌(PC: BCCI)

టీమిండియా స్టార్‌ పేసర్‌ దీపక్‌ చహర్‌ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ పుకార్లని బీసీసీఐ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. గురువారం మధ్యాహ్నం దీపక్‌ చహర్‌ గాయంతో ఆసియాకప్‌కు దూరమయ్యాడని.. అతని స్థానంలో కుల్దీప్‌ సేన్‌ను స్లాండ్‌ బై ప్లేయర్‌గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన బీసీసీఐ.. అవన్నీ తప్పుడు వార్తలని.. దీపక్‌ చహర్‌ జట్టుతోనే ఉన్నాడని తెలిపింది.

''దీపక్‌ చహర్‌ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అదంతా నాన్‌సెన్స్‌. దీపక్‌ చహర్‌ ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న అతను ప్రాక్టీస్‌ కూడా ఆరంభించాడు. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌ను కేవలం నెట్‌బౌలర్‌గానే జట్టులోకి తీసుకున్నాయి. టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేయడానికి మాత్రమే కుల్దీప్‌ సేన్‌ను నెట్‌బౌలర్‌గా ఎంపిక చేశాము. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.. కానీ జట్టులోకి రావడానికి సమయం ఉంది.'' అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. 


కుల్దీప్‌ సేన్‌(PC: IPL Twitter)

ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో గాయపడిన దీపక్ చాహార్, ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరంగా ఉన్న దీపక్ చాహార్, కమ్‌బ్యాక్ తర్వాత జింబాబ్వేతో రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. ఈలోగానే దీపక్ చాహార్ మళ్లీ గాయపడ్డాడనే వార్తలు రావడం అతని ఫ్యాన్స్‌ని కలవరబెట్టింది. అయితే దీపక్‌ చహర్‌కు ఏం కాలేదని తెలుసుకొని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆసియాకప్‌కు ప్రకటించిన జట్టులో భువనేశ్వర్ కుమార్ సీనియర్ ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. అతనితో పాటు టోర్నీకి ఎంపికైన ఆవేశ్ ఖాన్ జింబాబ్వే టూర్‌లో అట్టర్ ఫ్లాప్ కాగా... అర్ష్‌దీప్ సింగ్‌కి పట్టుమని ఐదు అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం కూడా లేదు. దీంతో దీపక్‌ చహర్‌ స్టాండ్‌-బైగా ఉన్నప్పటికి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతను బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఆసియా కప్ 2022 కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్

స్టాండ్ బై - శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్‌ చహర్‌
నెట్‌ బౌలర్‌- కుల్దీప్‌ సేన్‌

చదవండి: ఆరోజు కోహ్లి రెండున్నర గంటల పాటు బ్యాటింగ్‌ చేశాడు.. నేను షాకయ్యా!

 కన్నీళ్లు తెప్పించిన సజీవదహనం ఫోటోలు.. '31 మిలియన్‌ డాలర్లు చెల్లించండి'

>
మరిన్ని వార్తలు