ఫొటో షేర్‌ చేసి చిక్కుల్లో పడ్డ కుల్దీప్‌ యాదవ్‌!

19 May, 2021 10:57 IST|Sakshi

లక్నో: టీమిండియా క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తీరుపై కాన్పూర్‌ జిల్లా యంత్రాంగం అసహనం వ్యక్తం చేసింది. తమకు సమాచారం ఇవ్వకుండానే గెస్ట్‌హౌజ్‌లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న అతడి వ్యవహారశైలిని తప్పుబట్టింది. కాగా 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుల్దీప్‌ యాదవ్‌, స్థానిక గోవింద్‌నగర్‌లోని జగదీశ్వర్‌ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. అయితే, ఆస్పత్రికి వెళ్లకుండా కాన్పూర్‌ నగర్‌ నిగం అతిథి గృహంలోనే టీకా తీసుకున్నాడు. 

ఇందుకు సంబంధించిన ఫొటోను కుల్దీప్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. కోవిడ్‌పై పోరులో అంతా ఒక్కటి కావాలని, అవకాశం ఉన్నవాళ్లు త్వరితగతిన టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ పోస్టు కాన్పూర్‌ జిల్లా అధికారుల కంటపడింది. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కుల్దీప్‌ వ్యవహరించిన తీరుపై వారు విస్మయానికి గురయ్యారు. 

ఇక ఈ విషయంపై స్పందించిన కాన్పూర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ అలోక్‌ తివారి విచారణకు ఆదేశించారు.  ఎవరి అనుమతితో గెస్ట్‌హౌజ్‌లో కుల్దీప్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నాడనే అంశంపై ఆరా తీస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2021 వాయిదా పడటంతో కుల్దీప్‌ యాదవ్‌ ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.

చదవండి: నేను మరీ అంతపనికిరాని వాడినా: కుల్దీప్ యాద‌వ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు