-

IND vs BAN: బంగ్లాదేశ్‌ గడ్డపై కుల్దీప్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర.. తొలి భారత స్పిన్నర్‌గా

17 Dec, 2022 08:29 IST|Sakshi

దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి ఎం‍ట్రీ ఇచ్చిన భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కుల్దీప్‌.. 40 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో కూడా 40 పరుగులతో కుల్దీప్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 

కుల్దీప్‌ యాదవ్‌ అరుదైన రికార్డు
ఇక బంగ్లాపై ఐదు వికెట్లతో చెలరేగిన కుల్దీప్‌ యాదవ్‌ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌ గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత స్పిన్నర్‌గా కుల్దీప్‌ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది.

గతంలో బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో అశ్విన్‌ 87 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌తో అశ్విన్‌ రికార్డును కుల్దీప్‌(5/40) బ్రేక్‌ చేశాడు. ఇ‍క అశ్విన్‌ తర్వాతి స్థానంలో భారత దిగ్గజం అనిల్‌ కుం‍బ్లే(4/55) ఉన్నాడు.

పట్టు బిగించిన టీమిండియా
తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం కలుపుకుని భారత్‌  513 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచింది. శుబ్‌మన్‌ గిల్‌, పుజారాలు సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 258 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 150 పరుగులకు కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇ​క 512 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ మూడోరోజు ఆట ముగిసేసమయానికి వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసింది.
చదవండి: IND vs BAN: అతడి వల్ల రాహుల్‌ ఓపెనింగ్‌ స్థానానికి ఎసరు! జట్టులో చోటు కష్టమే

మరిన్ని వార్తలు