IPL 2022: "అత‌డు అద్భుత‌మైన స్పిన్న‌ర్‌.. వేలానికి ముందే సొంతం చేసుకోవాలి అనుకున్నాం"

17 Apr, 2022 17:13 IST|Sakshi
IPL.com

ఐపీఎల్‌-2022లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్పిన్న‌ర్ కుల్ధీప్ యాద‌వ్‌ అద్భుతంగా రాణిస్తోన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన కుల్థీప్ యాద‌వ్ 11 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ టోర్న్‌మెంట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక వికెట్ల‌ ప‌డ‌గొట్టిన బౌల‌ర్ల‌ జాబితాలో మూడో స్ధానంలో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే.. గ‌త కొన్ని సీజ‌న్‌లుగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన కుల్థీప్ యాదవ్‌ను ఆ జ‌ట్టు ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు రీటైన్ చేసుకోలేదు.

మెగా వేలంలో కుల్ధీప్ యాద‌వ్‌ను రూ. 2 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొనుగోలు చేసింది. ఇక 2021 సీజ‌న్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన కుల్థీప్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అవ‌కాశం రాలేదు. ఈ క్ర‌మంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ మెగా వేలంలో అత‌డిని ద‌క్కించుకోవ‌డానికి ఢిల్లీ  ఫ్రాంచైజీ ఎలా తహతహలాడిందో వెల్లడించాడు. కేకేఆర్‌లో అద్భ‌త‌మైన  స్పిన్నర్లు ఉన్నారని, అందుకే గత రెండు సీజన్‌లలో కుల్దీప్‌కు అవ‌కాశం ద‌క్క‌లేదని అత‌డు తెలిపాడు.

"కుల్దీప్‌ను వేలంలోకి కొనుగోలు చేయ‌డానికి మా ప్రాంఛైజీ చాలా ఆస‌క్తి క‌న‌బ‌రిచింది. అయితే గ‌త రెండు సీజ‌న్ల‌లో కేకేఆర్‌కు  చక్రవర్తి, నరైన్ ,షకీబ్ వంటి అద్భుత‌మైన స్పిన్న‌ర్లు ఉన్నారు. అందుకే కుల్థీప్‌కు పెద్దగా అవ‌కాశం ద‌క్క‌లేదు. కాగా కుల్థీప్ మాత్రం అద్భుత‌మైన స్పిన్న‌ర్లలో ఒక‌డు" అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 16 ప‌రుగుల తేడాతో ఓట‌మి చెందింది.

మరిన్ని వార్తలు