తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్‌! తల్లితో దిగిన ఫొటో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌!

3 Aug, 2022 16:09 IST|Sakshi
తల్లితో కుమార్‌ కార్తికేయ(PC: Kartikeya Singh Twitter)

Mumbai Indians -Kumar Kartikeya: అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. కష్టాల కడలిని ఈదాల్సి వచ్చినా వెనకడుగు వేయక ముందుకు సాగేవాళ్లు కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో ముంబై ఇండియన్స్‌ యువ స్పిన్నర్‌ కుమార్‌ కార్తికేయ సింగ్‌ కూడా ఒకడు. క్రికెటర్‌ కావాలన్న తన ఆశయం కుటుంబానికి భారం కావొద్దనే తలంపుతో 15 ఏళ్ల వయస్సులో ఇంటిని వీడాడు. సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను వీడి ఢిల్లీ చేరుకున్నాడు.

కష్టనష్టాలకోర్చి..
ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. పగలంతా పనిచేసుకుని.. ఏడాదిపాటు కేవలం రాత్రిపూట భోజనంతో సరిపెట్టుకుని లక్ష్యం దిశగా అడుగులు వేశాడు. కఠిన శ్రమ, ప్రతిభకు తోడు కాలం కలిసి రావడంతో 2018లో మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ జట్టు తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడు. తన ఆట తీరుతో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. 

అరంగేట్రంలోనే..
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్న కార్తికేయ ఐపీఎల్‌-2022తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే వికెట్‌ పడగొట్టి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్‌ తీసి క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. 

ఐదు వికెట్లతో మెరిసి..
ఇక ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2021-22 టోర్నీలో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించిన 24 ఏళ్ల కుమార్‌ కార్తికేయ.. ఫైనల్లో 5 వికెట్లతో రాణించాడు. తద్వారా మధ్యప్రదేశ్‌ తొలిసారిగా రంజీ టైటిల్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా తన కలలను సాకారం చేసుకుంటున్న కార్తికేయ తొమ్మిదేళ్ల తర్వాత తాజాగా తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నాడు.

ఈ విషయాన్ని కార్తికేయ స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘తొమ్మిదేళ్ల 3 నెలల తర్వాత నా కుటుంబాన్ని.. మా అమ్మను కలిశాను. ఈ అనుభూతిని వర్ణించడానికి, నా మనసులోని భావనలు తెలిపేందుకు మాటలు రావడం లేదు’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

ఈ సందర్భంగా తన తల్లితో కలిసి దిగిన ఫొటోను కార్తికేయ షేర్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. క్రికెటర్‌ కావాలన్న లక్ష్యం కోసం కార్తికేయ చేసిన త్యాగాన్ని కొందరు కొనియాడుతుంటే.. తల్లిదండ్రులను కలుసుకోవడానికి నీకు ఇన్నేళ్లు పట్టిందా అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు.
చదవండి: ICC T20 Rankings: బాబర్‌ ర్యాంకుకు ఎసరుపెట్టిన సూర్య! నెంబర్‌ 1 స్థానానికి చేరువలో!

మరిన్ని వార్తలు