Enid Bakewell: 50 ఏళ్ల క్రితమే వరల్డ్‌కప్‌ కొట్టింది.. ఇప్పటికీ అవార్డులు

31 Dec, 2022 17:03 IST|Sakshi

ఎనిడ్‌ బెక్‌వెల్‌.. ఇంగ్లీష్‌ మహిళా క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని రూపొందించుకుంది. ఇంగ్లండ్‌ మహిళా ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఎనిడ్‌ బెక్‌వెల్‌ ఖాతాలో ఒక వన్డే ప్రపంచకప్ ఉండడం విశేషం. ఇక 1968 నుంచి 1979 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎనిడ్‌ బెక్‌వెల్‌ 12 టెస్టులతో పాటు 23 వన్డే మ్యాచ్‌లు ఆడింది. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఎనిడ్‌ బెక్‌వెల్‌ 12 టెస్టుల్లో 1078 పరుగులతో పాటు 50 వికెట్లు, 23 వన్డేల్లో 500 పరుగులతో పాటు 25 వికెట్లు పడగొట్టింది.

ఇక 1973లో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆమె ప్రదర్శన ఎవరు అంత తేలిగ్గా మరిచిపోలేరు. ఎందుకంటే ఆరోజు జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో రాణించిన బెక్‌వెల్‌ సెంచరీతో(118 పరుగులు) మెరిసింది. అనంతరం బౌలింగ్‌లో 12 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్‌ అనే పదానికి నిర్వచనం చెప్పింది. 1973 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఎనిడ్‌ బెక్‌వెల్‌.. వరల్డ్‌కప్‌ సాధించి 50 ఏళ్లు కావొస్తున్నా ఇంకా అవార్డులు అందుకుంటూనే ఉందట.

వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఎంత వరల్డ్‌కప్‌ గెలిచినా మహా అయితే పొగుడడం తప్పిస్తే ప్రతీ ఏడాది అవార్డులు ఇవ్వడం కుదరదు. కానీ ఎనిడ్‌ బెక్‌వెల్‌ అందుకు మినహాయింపు. 1973 నుంచి చూసుకుంటే గత 50 ఏళ్లుగా ఆమెకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికి 82 ఏళ్ల వయసులోనే మొకాళ్లు సహకరించకపోయినప్పటికి రెగ్యులర్‌గా మైదానంలో క్రికెట్‌ ఆడుతూనే కనిపిస్తుంది. తాజాగా ఎనిడ్‌ బెక్‌వెల్‌ క్రికెట్‌ ఆడుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానానికి ఒక హద్దు ఉంటుంది.. కానీ ఎనిడ్‌ బెక్‌వెల్‌ విషయంలో మాత్రం అది తప్పని నిరూపితమైంది. 

చదవండి: Rishabh Pant: కోలుకోవడానికే ఆరు నెలలు.. ఈ ఏడాది కష్టమే

మరిన్ని వార్తలు