Pakistan Cricket: దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు?

23 Mar, 2023 10:44 IST|Sakshi

పాకిస్తాన్‌ దేశం ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతోంది. ఇప్పటికి అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అక్కడి పాకిస్తాన్‌ ఆటగాళ్లకు మాత్రం ప్లాట్లు, ఖరీదైన ఐఫోన్లను గిఫ్ట్‌లుగా అందజేశారు. ఇప్పుడు ఈ వార్త పాక్‌లో సంచలనం రేపింది.

విషయంలోకి వెళితే.. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) తొమ్మిదో సీజన్‌ విజేతగా లాహోర్‌ ఖలండర్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. ముల్తాన్‌ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో షాహిన్‌ అఫ్రిది సేన విజయం సాధించి వరుసగా రెండోసారి పీఎస్‌ఎల్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది.

దీంతో సదరు ఫ్రాంఛైజీ ఓనర్‌ లాహోర్‌ ఖలండర్స్‌ సీవోవో సమీన్‌ రాణా ఆటగాళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు ఇచ్చింది. ప్లేయర్స్ అందరికీ ప్లాట్లు, ఐఫోన్లు ఇచ్చారు. ఈ ఫ్రాంఛైజీ ఓనర్ ఖలందర్స్ సిటీ అనే ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంతో తమ ప్లేయర్స్ కు అందులోనే ప్లాట్లు ఇచ్చింది. ఈ ప్లాట్లు, ఐఫోన్లు అందుకున్న వాళ్లలో స్టార్ ప్లేయర్స్ షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, జమాన్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నారు. 

ఒక్కొక్క ప్లేయర్ కు 5445 చదరపు అడుగుల ప్లాట్లు ఇచ్చారు. వీటి విలువ పాకిస్థాన్ కరెన్సీలో 92. 5 లక్షలు కాగా.. ఇండియన్ కరెన్సీలో రూ.27 లక్షలు. ఈ లీగ్ మొత్తం ఆడే అవకాశం రాకుండా బెంచ్ కే పరిమితమైన ప్లేయర్స్ కు కూడా ఈ ప్లాట్లు ఇచ్చారు. పీఎస్‌లో ఫైనల్లో బ్యాట్‌తోనూ, బంతితోను మెరిసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదికి అదనంగా గిఫ్ట్‌లు అందించడం విశేషం.

ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో 44 రన్స్.. ఆ తర్వాత బౌలింగ్ లో రాణించిన షాహిన్‌ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లాహోర్ టీమ్ లీగ్ గెలిచినందుకు ఒక ప్లాట్ అందుకున్న షాహీన్.. కెప్టెన్ గా వ్యవహరించినందుకు మరో రెండు ప్లాట్స్‌ అదనంగా అందుకోవడం విశేషం. ఇది చూసిన క్రికెట్‌ అభిమానులు.. ''దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పాక్‌ ఆటగాళ్లకు లభించిన గిఫ్ట్‌లను డబ్బుల రూపంలో దేశానికి అందిస్తే బాగుండేది'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్‌ క్రికెటర్‌ గుడ్‌బై

అభిమానులను పిచ్చోళ్లను చేశారు

మరిన్ని వార్తలు