లక్ష్యసేన్‌కు నిరాశ

24 Nov, 2021 05:23 IST|Sakshi

తొలి రౌండ్‌లోనే ఓడిన కశ్యప్‌

ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

బాలి: ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు ఏ మాత్రం కలిసిరాలేదు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో బరిలోకి దిగిన లక్ష్యసేన్, పారుపల్లి కశ్యప్‌ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 21–23, 15–21తో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో పోరాడి ఓడాడు. 54 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ తొలి గేమ్‌ను చేజేతులా కోల్పోయాడు. ఇరు ఆటగాళ్ల మధ్య ఆధిక్యం పలుమార్లు మారిన తొలి గేమ్‌లో లక్ష్యసేన్‌ ఒక దశలో 18–14తో ఆధిక్యంలో ఉన్నాడు.

కీలక సమయంలో మొమోటా చాంపియన్‌ ఆటతో వరుసగా ఆరు పాయింట్లు సాధించి 20–18తో ఆధిక్యంలోకి వచ్చాడు. వెంటనే తేరుకున్న లక్ష్యసేన్‌ వరుసగా మూడు పాయింట్లు సాధించి 21–20తో గేమ్‌ పాయింట్‌కు వెళ్లాడు. మరోసారి తన అనుభవాన్ని ఉపయోగించిన మొమోటా వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో మరింత దూకుడు కనబర్చిన జపాన్‌ షట్లర్‌ మ్యాచ్‌ను ముగించేశాడు. మరో పోరులో కశ్యప్‌ 11–21, 14–21తో లోహ్‌ కీన్‌ య్యూ (సింగపూర్‌) చేతిలో వరుస సెట్లలో ఓడాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ధ్రువ్‌ కపిల–అర్జున్‌ ద్వయం 20–22, 13–21తో చోయ్‌ సొల్‌జ్యూ– కిమ్‌ వోన్‌హూ (కొరియా) జంట చేతిలో... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రసాద్‌–జుహి దేవాంగన్‌ జోడీ 12–21, 4–21తో జన్‌సెన్‌– లిండా ఎఫ్లర్‌ (జర్మనీ) జంట చేతిలో ఓడాయి.

మరిన్ని వార్తలు