శ్రేయస్‌ అయ్యర్‌ అరుదైన ఘనత.. భారత్‌ నుంచి ఆరో ఆటగాడిగా

22 Mar, 2021 20:44 IST|Sakshi

లండన్: త్వరలో ప్రారంభంకానున్న ఇంగ్లండ్‌ దేశవాళీ టోర్నీ, రాయల్‌ లండన్‌ కప్‌-2021 కోసం లంకషైర్ క్రికెట్‌ క్లబ్.. ‌టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ ముగిసాక ఈ టోర్నీ ప్రారంభంకానుంది. దీని కోసం అయ్యర్‌ జూలై 15న లండన్‌కు చేరుకొని, నెల రోజుల పాటు జరిగే లీగ్‌ మ్యాచ్‌లలో ఆడతాడు. ఈ విషయాన్ని లంకషైర్ యాజమాన్యం సోమవారం తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. 50 ఓవర్ల టోర్నమెంట్‌లో భాగంగా లంకషైర్‌ జట్టు జూలై 20న ససెక్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

కాగా, గతంలో లంకషైర్ జట్టుకు ఫరూక్‌ ఇంజనీర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సౌరవ్ గంగూలీ, దినేశ్‌ మోంగియా, మురళీ కార్తీక్‌ లాంటి భారత దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. వారి తర్వాత అయ్యర్‌కు మాత్రమే ఆ అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా తరఫున 21 వన్డేలు, 29టీ20లకు ప్రాతినిధ్యం వహించిన అయ్యర్‌ లంకషైర్‌ తరఫున బరిలో దిగబోతున్న ఆరో ఇండియన్‌ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు.

మరిన్ని వార్తలు