T20 World Cup 2022: వరల్డ్‌ కప్‌కు ముందు జింబాబ్వేకు భారీ షాక్‌

7 Oct, 2022 16:23 IST|Sakshi

ఈనెల (అక్టోబర్‌ 16) నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందు క్వాలిఫయర్‌ జట్టు జింబాబ్వేకు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ లాన్స్‌ క్లూసెనర్‌ మెగా టోర్నీకి ముందు జట్టుతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు శుక్రవారం (అక్టోబర్‌ 7) ప్రకటించాడు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్‌ బోర్డు సైతం దృవీకరించింది. క్లూసెనర్‌ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని క్రికెట్‌ జింబాబ్వే పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో క్లూసెనర్‌కు పలు దేశాల క్రికెట్‌ బోర్డులతో ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో జింబాబ్వేకు పూర్తి స్థాయి సేవలు అందించేందుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడని, అందుకే ఈ మేరకు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని క్లూసెనర్‌ ప్రతినిధి తెలిపాడు. 

కాగా, క్లూసెనర్‌ ఈ ఏడాది మార్చిలో జింబాబ్వే బ్యాటింగ్‌ కోచ్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టాడు. అంతకుముందు అతను 2016-2018 మధ్యకాలంలో కూడా జింబాబ్వే బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందించాడు. క్లూసెనర్‌ హయాంలో జింబాబ్వే పూర్వపు స్థాయిలో విజయాలు సాధించి ఆకట్టుకుంది. జింబాబ్వే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో క్లూసెనర్‌ కీలకపాత్ర పోషించాడు. ఫ్లవర్‌ సోదరులు, అలిస్టర్‌ క్యాంప్‌బెల్‌ లాంటి స్టార్‌ ప్లేయర్ల రిటైర్మెంట్‌ తర్వాత చతికిలబడిన జింబాబ్వేకు క్లూసెనర్‌ తన బ్యాటింగ్‌ మెళకువలతో పునరుజ్జీవం పోశాడు. 

ఇటీవలి కాలంలో సికిందర్‌ రాజా, క్రెయిగ్‌ ఐర్విన్‌, సీన్‌ విలియ​మ్స్‌ లాంటి ప్లేయర్లు రాటుదేలడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే, జింబాబ్వే జట్టు క్వాలిఫయర్స్‌లో మరో ఏడు జట్లతో కలిసి పోటీపడనుంది. క్వాలిఫయర్స్‌  గ్రూప్‌-ఏలో శ్రీలంక, నెదర్లాండ్స్‌, నమీబియా, యూఏఈ జట్లు పోటీపడనుండగా.. గ్రూప్‌-బిలో వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ జట్లతో జింబాబ్వే అమీతుమీ తేల్చుకోనుంది. క్వాలిఫయర్‌ దశ మ్యాచ్‌లు అక్టోబర్‌ 16 నుంచి అక్టోబర్‌ 21 వరకు జరుగనుండగా.. సూపర్‌-12 మ్యాచ్‌లు అక్టోబర్‌ 22 నుంచి ప్రారంభమవుతాయి.అక్టోబర్‌ 23న భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య హైఓల్టేజీ మ్యాచ్‌ జరుగనుంది. 

మరిన్ని వార్తలు