చహల్‌పై ఆసీస్‌ అభ్యంతరం

4 Dec, 2020 16:57 IST|Sakshi

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాచ్‌లో గెలుపు కోసం ఎంతవరకూ అయినా వెళుతుంది ఆసీస్‌. ఇక్కడ స్లెడ్జింగ్‌, ట్యాంపరింగ్‌, డ్రెస్సింగ్‌ రూమ్‌ మెసెజ్‌లు ఇలా ప్రతీ వివాదం వారి చుట్టూనే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తీసుకొచ్చిన రూల్‌ను కూడా వారు ఒప్పుకోవడం లేదు.  ఒక ఆటగాడు గాయపడితే అతని స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మరొక ఆటగాడు రావొచ్చనేది ఐసీసీ  రూల్‌. దాన్ని గతంలో మొదటిగా వినియోగించున్నది కూడా ఆసీస్‌ క్రికెట్‌ జట్టే. అలా వచ్చినవాడే లబూషేన్‌.  మరి ఇప్పుడు అదే రూల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఆసీస్‌. తమకో న్యాయం మరొకరికి మరొక న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. (కోహ్లి.. ఇదేం వ్యూహం?)

ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా గాయపడ్డాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో హెల్మెట్‌కు బంతి తాకడంతో ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. అయితే టీమిండియా బ్యాటింగ్‌ ముగిసిన తర్వాత అతని స్థానంలో చహల్‌ను కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా టీమిండియా తీసుకుంది. దీనికి మ్యాచ్‌ రిఫరీని అడిగి మరీ చహల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. కాగా, దానిపై ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ రిఫరీగా ఉన్న తమ దేశానికే చెందిన డేవిడ్ బూన్‌ వద్దకు వెళ్లి మరీ వాదించాడు. ఈ విషయాన్ని ఆన్‌ ఫీల్డ్‌ కామెంటేర్లు సంజయ్‌ మంజ్రేకర్‌, అజిత్‌ అగార్కర్‌లు తప్పుబట్టారు. ఇలా ఒక ఆటగాడు గాయపడితే మరొక ఆటగాడ్ని తీసుకోవడం ప్రతీ జట్టు హక్కు అని, అటువంటప్పుటు ఆసీస్‌ కోచ్‌ లాంగర్‌కు అభ్యంతరం ఎందుకో అర్ధం కావడం లేదని విమర్శించారు. ఈ మ్యాచ్‌లో కాంకషన్‌గా వచ్చిన చహల్‌ మూడు వికెట్లు సాధించాడు. ఫించ్‌(35), స్మిత్(12),. మాథ్యూ  వేడ్‌(7)‌లను ఔట్‌ చేశాడు. తన ఆఖరి ఓవర్‌ చివరి బంతికి వేడ్‌ను ఔట్‌ చేయడంతో మూడో వికెట్‌ను చహల్‌ ఖాతాలో వేసుకున్నాడు. 
 

>
మరిన్ని వార్తలు