Chamika Karunaratne: లంక క్రికెటర్‌ను చుట్టుముట్టిన కష్టాలు.. రెండురోజుల పాటు

16 Jul, 2022 15:30 IST|Sakshi

శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.తినడానికి సరైన తిండి దొరక్క అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆర్ధిక సంక్షోభానికి.. రాజకీయ సంక్షోభం కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.  లంక అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆ దేశ ప్రజలు ప్రెసిడెన్షియల్‌ భవనాన్ని ముట్టడించారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ముందుగా మాల్దీవులు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్‌ చేరుకున్న ఆయన అక్కడి నుంచి తన రాజీనామా పత్రాన్ని ఈమెయిల్‌ ద్వారా పంపించారు. కాగా తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. 

ఇదిలా ఉంటే దేశంలో నిత్యవసరాలు సహా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్‌ కోసం రోజుల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. తాజాగా ఆ ప్రభావం లంక క్రికెటర్లపై కూడా పడింది. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ దొరకక.. ఎందరో ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్నారు.గ్రౌండ్‌ వరకు వెళ్లాలంటే రవాణావ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి దారుణమైన పరిస్థితిని శ్రీలంక క్రికెటర్‌ చమిక కరుణరత్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రెండు రోజుల పాటు క్యూలో నిల్చున్న కరుణరత్నే పెట్రోల్‌ సంపాదించుకున్నాడు. 

ఈ క్రమంలో ఏఎన్‌ఐ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరుణరత్నే మాట్లాడుతూ.. ''దొరికిన పది వేల రూపాయల పెట్రోల్‌ తో రెండు మూడు రోజుల వరకు ప్రాక్టీస్‌కు వెళ్లాలి. దేశంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే బాధ కలుగుతుంది. దేశానికి అండగా నిలబడుతూనే  మా ఆటపై ఫోకస్‌ పెట్టాల్సిన అవసరం ఉంది.  గొటబాయ రాజపక్స రాజీనామా తర్వాతైనా లంకకు అధ్యక్షుడిగా మంచి వ్యక్తులు వస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే అంతా సర్దుకుంటుందని.. శ్రీలంక ప్రజలకు కచ్చితంగా మంచి జరుగుతుందని'' ఆశాభావం వ్యక్తం చేశాడు. 

ఇక ఆసియా కప్‌ 2022కు శ్రీలంకనే ఆతిధ్యం ఇవ్వనుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను లంక క్రికెటర్లను కలవరపెడుతోంది. ఆసియా కప్‌ లో రాణించాలంటే కనీస ప్రాక్టీస్‌ ఎంతో అవసరం.  అయితే లంక క్రికెటర్లు చాలా మంది కూడా పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో గ్రౌండ్‌ లకు వెళ్లి ప్రాక్టీస్‌ కూడా చేయలేకపోతున్నారు. మరి ఆసియా కప్‌ వేదికను ఐసీసీ మారుస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే మ్యాచ్‌ లు జరిగే సమయంలో ఆటగాళ్లను మైదానాలకు తీసుకెళ్లడం.. హోటల్‌ కు తీసుకురావడం కోసం ఎంతగానో చమురు అవసరం పడుతుంది. 
 
శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ముదిరి పాకానా పడ్డప్పటికి గత నెలలో ఆస్ట్రేలియా జట్టు లంక పర్యటనకు వచ్చింది. కష్టాల్లో ఉన్న లంకతో సిరీస్‌ ఆడి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొంది. టి20 సిరీస్‌ ను ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్‌ ను శ్రీలంక గెలుచుకుంది. రెండు మ్యాచ్‌ ల టెస్టు సిరీస్‌లో మాత్రం ఇరుజట్లు చెరో మ్యాచ్‌ గెలిచి డ్రా చేసుకున్నాయి.  ఇక కరుణరత్నే 2019లో అంతర్జాతీయ క్రికెట్‌ లో కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్‌ తో పాటు 18 వన్డే, 25 టీట్వంటీ మ్యాచ్‌ లు ఆడాడు.

చదవండి: Gotabaya Rajapaksa: అందుకోసం శతవిధాల ప్రయత్నం చేశా: గొటబయ

Virat Kohli: సెంచరీ కోసం కోహ్లి కూడా ఇంతలా తపించి ఉండడు..

మరిన్ని వార్తలు