లంక ప్రీమియర్‌ లీగ్‌ మళ్లీ వాయిదా

7 Nov, 2020 05:34 IST|Sakshi

కొలంబో: లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీ ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. దేశంలో కరోనా వైరస్‌ కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత ఆగస్టు నుంచి నవంబర్‌ 14కు... అనంతరం 21కు వాయిదా పడ్డ ఎల్‌పీఎల్‌... తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆరు రోజులు ఆలస్యంగా నవంబర్‌ 27న మొదలు కానుంది.

ఈ టోర్నీని మూడు వేదికల్లో జరపాలని భావించినా... కరోనా నేపథ్యంలో టోర్నీలో జరిగే మొత్తం 23 మ్యాచ్‌లను ఒకే వేదికలో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఎల్‌సీ పేర్కొంది. ఇందుకు హంబన్‌తోటను ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది. డిసెంబర్‌ 17న ఫైనల్‌ జరగనుంది. ఆటగాళ్లకు విధించే  క్వారంటైన్‌ను 14 రోజుల నుంచి 7 రోజులకు కుదించేందుకు శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారులు అంగీకరించారు. అయితే జట్ల సహాయక సిబ్బంది మాత్రం 14 రోజుల క్వారంటైన్‌ను çపూర్తి చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ లీగ్‌లో క్రిస్‌ గేల్, డు ప్లెసిస్, షాహిద్‌ అఫ్రిది, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ వంటి విదేశీ స్టార్‌ ప్లేయర్లు పాల్గొంటున్నారు.

>
మరిన్ని వార్తలు