IPL 2022: రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌ కోచ్‌గా లసిత్ మలింగ..

11 Mar, 2022 15:14 IST|Sakshi

ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక యార్కర్ల కింగ్‌ లసిత్ మలింగను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కాగా గత ఏడాది అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి మలింగ తప్పుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుకు తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌గా మలింగ పనిచేశాడు.

అయితే ఈ సిరీస్‌లో బౌలింగ్‌ పరంగా శ్రీలంక జట్టు అద్భుతంగా రాణించింది. ఇక ఐపీఎల్‌లో 11 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన మలింగ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 122 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసిన మలింగ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇప్పటికీ కొనసాగుతోన్నాడు. ఇటువం‍టి అద్భుతమైన బౌలర్‌ జట్టుకు కోచ్‌గా రావడం రాజస్తాన్‌కు మరింత బలాన్ని చేకూరుస్తుంది.

నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ పేసర్లకు మలింగ్‌ తన అనుభవాన్ని పంచనున్నాడు. ఇక శ్రీలంక దిగ్గజం, రాజస్తాన్‌ ఫ్రాంచైజీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ కూమార సంగర్కాకరతో కలిసి మలింగ పనిచేయనున్నాడు. మరో వైపు మెగా వేలం‍లో రాజస్తాన్‌.. దేవదత్ పడిక్కల్, బౌల్ట్‌, హెట్‌మైర్‌, అశ్విన్‌ వంటి అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్‌ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది.

చదవండి: IPL 2022- CSK: అలా కాదు.. ఇలా.. ! నెట్‌ సెషన్‌లో పాల్గొన్న యువ ప్లేయర్‌కు ధోని సూచనలు!

మరిన్ని వార్తలు