Laver Cup: ‘సంతాపం కాదు...సంబరంలా ఉండాలి’

23 Sep, 2022 04:18 IST|Sakshi

నేడు ఫెడరర్‌ చివరి మ్యాచ్‌ 

లేవర్‌ కప్‌లో నాదల్‌తో కలిసి డబుల్స్‌ బరిలోకి 

అర్ధరాత్రి 1.30నుంచి ‘సోనీ’ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షప్రసారం

లండన్‌: రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్‌ ప్రపంచాన్ని శాసించిన స్టార్‌ ప్లేయర్‌ రోజర్‌ ఫెడరర్‌ చివరి పోరుకు సమయం ఆసన్నమైంది. గత గురువారం రిటైర్మెంట్‌ ప్రకటించిన ఫెడరర్‌ శుక్రవారం చివరిసారిగా బరిలోకి దిగనున్నాడు. లేవర్‌ కప్‌లో టీమ్‌ యూరోప్‌ తరఫున ఆడనున్న ఫెడరర్‌... ఈ మ్యాచ్‌లో మరో స్టార్‌ రాఫెల్‌ నాదల్‌తో కలిసి డబుల్స్‌ మ్యాచ్‌ ఆడనుండటం విశేషం. ఫెడరర్‌–నాదల్‌ జోడి జాక్‌ సాక్‌–ఫ్రాన్సిస్‌ టియాఫో (టీమ్‌ వరల్డ్‌)తో తలపడుతుంది.

లేవర్‌ కప్‌ తొలి రోజే ఫెడెక్స్‌ ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లా డుతూ...‘నా చివరి మ్యాచ్‌ ఏదో అంతిమ యాత్రలాగ ఉండరాదు. అదో సంబరంలా కనిపించాలి. కోర్టులో చాలా సంతోషంగా ఆడాలని, మ్యాచ్‌ హోరాహోరీగా సాగాలని కోరుకుంటున్నా. సరిగ్గా చెప్పాలంటే ఒక పార్టీలో పాల్గొన్నట్లు అనిపించాలి. చాలా రోజుల తర్వాత బరిలోకి దిగుతున్నాను కాబట్టి కొంత ఒత్తిడి ఉండటం సహజం. నేను మ్యాచ్‌లో పోటీ ఇవ్వగలనని నమ్ముతున్నా’ అని ఫెడరర్‌ స్పష్టం చేశాడు.

ఆటలో కొనసాగే శక్తి తనలో లేదని తెలిసిన క్షణానే రిటైర్మెంట్‌ గురించి ఆలోచించానని, పూర్తి సంతృప్తితో తప్పుకుంటున్నట్లు అతను చెప్పాడు. ‘వీడ్కోలు పలకడం బాధ కలిగించే అంశమే. కోర్టులోకి అడుగు పెట్టాలని, ఇంకా ఆడాలని ఎప్పుడూ అనిపిస్తుంది. ప్రతీ కోణంలో నా కెరీర్‌ను ఇష్టపడ్డాను. వాస్తవం ఏమిటంటో ప్రతీ ఒక్కరు ఏదో ఒక క్షణంలో పరుగు ఆపి ఆటనుంచి తప్పుకోవాల్సిందే.

అయితే నా ప్రయా ణం చాలా అద్భుతంగా సాగింది కాబట్టి చాలా సంతోషం’ అని ఈ స్విస్‌ దిగ్గజం తన కెరీర్‌ను విశ్లేషించాడు. రిటైర్మెంట్‌ తర్వాతి ప్రణాళికల గురించి చెబుతూ...‘ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వా త బోర్గ్‌లాంటి దిగ్గజం దశాబ్దాల పాటు కోర్టు వైపు రాలేదని విన్నాను. నేను అలాంటివాడిని కా ను. ఎప్పుడూ జనంలో ఉండాలని కోరుకుంటా ను. ఏదో ఒక హోదాలో టెన్నిస్‌తో కొనసాగుతా ను. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఎవరికీ కనిపించకుండా దెయ్యంలా మాత్రం ఉండిపోను’ అని ఫెడరర్‌ సరదాగా వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు