LCT 2023: 26 బం​తుల్లో బౌండరీ, 10 సిక్సర్లతో వీరవిహారం

27 Mar, 2023 21:14 IST|Sakshi

లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ-2023లో భాగంగా పట్నా వారియర్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో చండీఘడ్‌ ఛాంప్స్‌ 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఛాంప్స్‌.. పునీత్‌ కుమార్‌ (26 బంతుల్లో 78 నాటౌట్‌; ఫోర్‌, 10 సిక్సర్లు), భాను సేథ్‌ (21 బంతుల్లో 43; 6 సిక్సర్లు), గౌరవ్‌ తోమర్‌ (43 బంతుల్లో 86; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అనంతరం బరిలోకి దిగిన పట్నా వారియర్స్‌.. ఛాంప్స్‌ బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఛాంప్స్‌ బౌలర్లు పర్వీన్‌ థాపర్‌ 3, గౌరవ్‌ తోమర్‌, రమన్‌ దత్తా, తిలకరత్నే దిల్షన్‌ తలో 2 వికెట్లు, ముకేశ్‌ సైనీ ఓ వికెట్‌ పడగొట్టారు. వారియర్స్‌ ఇన్నింగ్స్‌ 9వ నంబర్‌ ఆటగాడు ప్రవీణ్‌ గుప్తా (21) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ఇదిలా ఉంటే, మొత్తం 6 జట్టు పాల్గొంటున్న లెజెండ్స్‌ క్రికెట్‌  ట్రోఫీ-2023లో చండీఘడ్‌ ఛాంప్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఛాంప్స్‌ తర్వాత ఇండోర్‌ నైట్స్‌ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు) రెండులో, వైజాగ్‌ టైటాన్స్‌ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు), గౌహతి అవెంజర్స్‌ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 2 పాయింట్లు), పట్నా వారియర్స్‌ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 2 పాయింట్లు), నాగ్‌పూర్‌ నింజాస్‌ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. 

కాగా, ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు పలువురు దేశ, విదేశీ స్టార్లు కూడా పాల్గొంటున్నారు. రాస్‌ టేలర్‌, తిలకరత్నే దిల్షాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, మాంటీ పనేసర్‌, ఉపుల్‌ తరంగ, సనత్‌ జయసూర్య, సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ తదితర ఇంటర్నేషనల్‌ స్టార్లు వివిధ టీమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   

మరిన్ని వార్తలు