IPL 2022 Auction: వేలంలో పాల్గొనాలంటూ స్టార్‌ ఆటగాడికి ఫోన్‌కాల్‌.. కానీ

1 Feb, 2022 17:38 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 మెగావేలంకు సంబంధించిన ఫైనల్‌ లిస్టు మంగళవారం విడుదలైంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న మెగావేలానికి 590 మంది క్రికెటర్లు షార్ట్‌లిస్ట్‌ అయ్యారు. బెంగళూరు వేదికగా జరగనున్న వేలంలో వీరిని ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో చూడాలి. అయితే ఈసారి వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌.. విధ్వంసకర ఆటగాడు.. యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌ సీజన్‌కు దూరంగా ఉండనున్నాడు. అందుకే ఈసారి వేలంలో తన పేరును కూడా రిజిస్టర్‌ చేసుకోలేదు. అయితే క్రిక్‌బజ్‌ నిర్వహించిన సర్వేలో రెండు ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొనబోతున్న 590 మంది ఫైనల్‌ లిస్టులో గేల్‌ పేరును చేర్చాలని భావించినట్లు సమాచారం.

చదవండి: ఆర్సీబీతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైన కోహ్లి

గేల్‌ పంబాబ్‌ కింగ్స్‌తో పాటు ఆర్‌సీబీకి ఎక్కువకాలం ఆడాడు. బహుశా ఈ రెండు ఫ్రాంచైజీలే గేల్‌ను సంప్రదించి ఈసారి వేలంలో పాల్గొనాలని.. తాము కొనుగోలు చేస్తామని ఫోన్‌ చేసినట్ల తెలిసింది. అయితే గేల్‌ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడని.. వేలంలో ఈసారి తాను పాల్గొనబోయేది లేదని.. ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం.  గేల్‌తో పాటు బెన్‌ స్టోక్స్‌, మిచెల్‌ స్టార్క్‌లకు కూడా ఫోన్‌ కాల్స్‌ వెళ్లినట్లు.. కానీ వీరిద్దరు ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ఇక ఈసారి 590 మంది క్రికెటర్లు వేలానికి షార్ట్‌లిస్ట్‌ అయినట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. ఇందులో 228 మంది క్యాప్డ్‌ ప్లేయర్లు కాగా... 355 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్‌ దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఇక టీమిండియా నుంచి శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్‌, అశ్విన్‌, మహ్మద్‌ షమీ, ఇషాన్‌ కిషన్‌, అజింక్య రహానే, సురేశ్‌ రైనా, యజువేంద్ర చహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ తదితర స్టార్‌​ ప్లేయర్లు రేసులో నిలిచారు. 

అదే విధంగా అఫ్గనిస్తాన్‌ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్‌ నుంచి 5, ఇంగ్లండ్‌ నుంచి 24, ఐర్లాండ్‌ నుంచి 5, న్యూజిలాండ్‌ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్‌ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్‌ నుంచి ఒకరు, స్కాట్లాండ్‌ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన విడుదల చేశారు.  

చదవండి: IPL 2022 Auction Players List: మెగా వేలంలో పాల్గొనబోయేది వీళ్లే: బీసీసీఐ

మరిన్ని వార్తలు