IND VS AUS 2nd Test: కేవలం ఒక్క పరుగు లీడ్‌.. 35 ఏళ్ల రికార్డు బద్దలు

18 Feb, 2023 17:25 IST|Sakshi

న్యూఢిల్లీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీమిండియా.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు కేవలం ఒక్క పరుగు దూరంలో (262 ఆలౌట్‌) నిలిచిపోయింది. దీంతో ఆసీస్‌ పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. భారత్‌పై లీడ్‌పై పరంగా ఇదీ ఓ రికార్డే.

1958లో కాన్పూర్‌ వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ ఒక్క పరుగు ఆధిక్యం కూడా లేకుండా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు ఒకే స్కోర్‌ సాధించాయి. ఇదే సీన్‌ 1986లో జరిగిన బర్మింగ్హమ్‌ టెస్ట్‌లో మరోసారి రిపీటైంది. భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు తొలి ఇన్నింగ్స్‌లో సమానమైన స్కోర్‌లు సాధించాయి. దీని తర్వాత 1988లో ముంబై వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పర్యాటక జట్టు 2 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. తాజాగా ఢిల్లీ టెస్ట్‌లో ఆసీస్‌కు ఒక్క పరుగు ఆధిక్యం లభించడంతో పై పేర్కొన్న మూడు టెస్ట్‌ల మధ్యలో చోటు దక్కించుకుంది.   

ఇదిలా ఉంటే, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 263 పరుగులు చేయగా.. భారత్‌ 262 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 61 పరుగులు చేసి 62 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఖ్వాజా (6) జడేజా బౌలింగ్‌లో ఔట్‌ కాగా.. ట్రవిస్‌ హెడ్‌ (39 నాటౌట్‌), లబూషేన్‌ (16 నాటౌట్‌) క్రీజ్‌లో కొనసాగుతున్నారు.

కాగా, రెండో రోజు ఆటలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను.. అక్షర్‌ పటేల్‌ (74), కోహ్లి (44), అశ్విన్‌ (37), జడేజా (26) ఆదుకున్నారు. వీరిలో ముఖ్యంగా అశ్విన్‌-అక్షర్‌ జోడీ 100కి పైగా పరుగుల జోడించి టీమిండియాను తిరిగి మ్యాచ్‌లో నిలబెట్టింది. అక్షర్‌ స్పెషలిస్ట్‌ బ్యాటర్లా రెచ్చిపోవడంతో మ్యాచ్‌పై పట్టుసాద్దామనుకున్న ఆసీస్‌ ఆశలు అడియాసలయ్యాయి. ఆసీస్‌ బౌలర్లలో లియోన్‌ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి 5 వికెట్లు పడగొట్టగా.. కున్నేమన్‌, మర్ఫీ తలో రెండు వికెట్లు, కమిన్స్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. అంతకుముందు ఖ్వాజా (81), హ్యాండ్స్‌కోంబ్‌ (72) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు షమీ 4, అశ్విన్‌, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు.  


 

మరిన్ని వార్తలు