ఆర్సీబీ వదులుకుంది.. ఢిల్లీ తీసుకుంది

19 Oct, 2020 17:39 IST|Sakshi

దుబాయ్‌: గాయం కారణంగా ఈ ఐపీఎల్‌ సీజన్‌ నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా స్థానంలో కర్ణాటకకు చెందిన ప్రవీణ్‌ దూబేకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఏడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ.. గాయపడి టోర్నీకి దూరమైన ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేస్తోంది. ఈ క్రమంలోనే అమిత్‌ మిశ్రా స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ దూబేను తీసుకున్నారు. ఈ మేరకు దూబేతో ఒప్పందం చేసుకుంది డీసీ. ఈ సీజన్‌లో అమిత్‌ మిశ్రా మూడు మ్యాచ్‌లే ఆడాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో మిశ్రా ఉంగరం వేలికి గాయమైంది. దాంతో అతను సీజన్‌ నుంచి నిష్క్రమించాడు. దాంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఢిల్లీ అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ప్రవీణ్‌ దూబే అవకాశం దక్కించుకున్నాడు. మిశ్రా టోర్నీ నుంచి వైదొలిగిన రెండు వారాల తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేశారు. ఇక ఇషాంత్‌ శర్మ కూడా గాయపడి టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పేస్‌ విభాగంలో ఢిల్లీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. రబడా, నోర్జే, దేశ్‌పాండేలు పేస్‌ విభాగంలో ఉన్నారు. దాంతో ఇషాంత్‌ శర్మ స్థానాన్ని భర్తీ చేసేందుకు డీసీ తొందరపడటం లేదు.(రోహిత్‌ దూరమైతే.. కెప్టెన్‌గా ఎవరు?)

ప్రవీణ్‌ దూబే ఎవరు?
కర్ణాటకకు చెందిన ప్రవీణ్‌ దూబే.. ఈ ఏడాది ఆరంభంలో తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పటివరకూ ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ను దూబే ఆడాడు. ఇక 8 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు, 14 టీ20  మ్యాచ్‌లు ఆడాడు. కాగా, ప్రవీణ్‌ దూబే వెలుగులోకి వచ్చింది మాత్రం 2015లో. కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌ ఆడిన సమయంలో ఆర్సీబీని ఆకర్షించాడు. దాంతో 2016లో అతన్ని ఆర్సీబీ తీసుకుంది. అతని కనీస ధర రూ. 35లక్షలకు కొనుగోలు చేసింది. అయితే రెండు సీజన్ల పాటు ఆర్సీబీ వెంటే ఉన్నాడు ప్రవీణ్‌ దూబే. కానీ ఆ తర్వాత అతన్ని రిలీజ్‌ చేయగా, ఎవరూ కొనుగోలు చేయలేదు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ అతన్ని తీసుకోవడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ‘ నాకు చాలా సంతోషంగా ఉంది. నా టాలెంట్‌ను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు  ఢిల్లీ ఫ్రాంచైజీకి థాంక్స్‌. నా సీనియర్లు రవి అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌తో కలిసి బౌలింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని ప్రవీణ్‌ తెలిపాడు. చివరకు ప్రవీణ్‌ దూబేను తీసుకోవడంలో రికీ పాంటింగ్‌, మహ్మద్‌ కైఫ్‌ల కీలక పాత్ర పోషించారు. మేనేజ్‌మెంట్‌ను ఒప్పించి ప్రవీణ్‌కు అవకాశం కల్పించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు