‘ఎన్ని గెలిచి ఏం లాభం, ఒక్కసెషన్‌ టీమిండియా కొంపముంచింది’

27 Jun, 2021 16:18 IST|Sakshi

ముంబై: తుది సమరంలో గెలిస్తేనే అది అసలైన విజయమని, మిగతా ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా ఏం ఉపయోగం లేదని ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమిపై విశ్లేషిస్తూ ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌డే నాడు ఒక్క సెషన్‌ టీమిండియా కొంపముంచిందని ఆయన పేర్కొన్నాడు. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ హోదా కోసం కోహ్లీ సేన రెండేళ్లుగా పడిన కష్టం, సాధించిన విజయాలు ఆ ఒక్క సెషన్‌తో కనుమరుగయ్యాయని వెల్లడించాడు. గెలిచిన ట్రోఫీల ఆధారంగానే జట్లు, కెప్టెన్ల పేరు ప్రఖ్యాతులు చరిత్రలో నిలబడుతాయని, అంతిమ యుద్ధం గెలవకపోతే ఎంత మందిని ఓడించినా లాభం లేదని వ్యాఖ్యానించాడు. రిజర్వ్‌డే రోజు ఎలాగైనా ఫలితం సాధించాలనే అత్యుత్సాహంతో టీమిండియా ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు. 

ఆఖరి రోజు తొలి సెషన్‌లో జాగ్రత్తగా ఆడాలని నిపుణులు హెచ్చరించినప్పటికీ.. కోహ్లీ, పుజారాలు అలక్ష్యంగా వికెట్‌ పారేసుకోవడంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టుకోల్పోయిందని, గత ఐదేళ్లుగా టెస్ట్‌ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న టీమిండియా కేవలం ఒక్క గంట ఆటతో ఆ ఇమేజ్‌ మొత్తాన్ని నాశనం చేసుకుందని పేర్కొన్నాడు. కాగా, రిజర్వ్‌డే రోజు కోహ్లీ, పుజారా ఔటయ్యాక భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 32 పరుగుల ఆధిక్యాన్ని మినహాయిస్తే న్యూజిలాండ్‌ లక్ష్యం 138 పరుగులకు చేరింది. కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ (52), టేలర్‌ (47) అద్భుతంగా పోరాడి తమ జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. 
చదవండి: Michael Vaughan: ‘అలా అయితే భారత్‌ను ఓడించడం కష్టమే’

మరిన్ని వార్తలు