Pele: 'నాకేం కాలేదు బాగానే ఉన్నా.. భయపడకండి'

4 Dec, 2022 13:30 IST|Sakshi

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్వయంగా స్పష్టతనిచ్చాడు. తాను బాగానే ఉన్నానని.. తిరిగి కోలుకుంటున్నట్లు ప్రకటించాడు. 82 ఏళ్ల పీలేకు గతేడాది క్యాన్సర్‌ కారణంగా పెద్ద పేగులో కణతిని తొలగించారు. అప్పటినుంచి తరచూ చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నాడు. తాజాగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబసభ్యులు సావో పౌలో పట్టణంలోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు.

ఆదివారం ఉదయం  పీలే పరిస్థితి విషమంగా ఉందని.. కీమో థెరపీకి కూడా స్పందించడం లేదని.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తన ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు ప్రచారంపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పీలే స్పందించాడు.  తాను బాగానే ఉన్నట్లు వెల్లడించాడు. తన కోసం ప్రార్థిస్తున్న వాళ్లంతా ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని.. తాను బాగానే ఉన్నానని ప్రకటించాడు. తాను సానుకూల దృక్పథంతో ఉన్నట్లు.. చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పాడు. దేవుడిపై తనకు విశ్వాసం ఉందని.. మీరు చూపిస్తున్న ప్రేమ నాకు మరింత శక్తినిస్తోందని తెలిపాడు.

ఈ సందర్భంగా తన కోసం ప్రార్థిస్తున్న అభిమానులకు, చికిత్స అందిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా పీలేకు గతేడాది క్యాన్సర్ సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. తర్వాత ఆయన కోలుకున్నారు. తిరిగి ఇటీవల క్యాన్సర్ సంబంధిత సమస్యతోనే ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆసుపత్రిలో ఉన్న ఆయన ఆరోగ్యంపై రోజుకో రకంగా వార్తలు వస్తున్నాయి.

A post shared by Pelé (@pele)

చదవండి:  దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం..

మ్యాచ్‌ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన?

మరిన్ని వార్తలు