Usain Bolt: 'అదంతా అబద్ధం.. డబ్బు నాకు ముఖ్యం కాదు'

1 Feb, 2023 12:06 IST|Sakshi

లెజెండరీ స్ప్రింటర్‌.. జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ ఖాతా నుంచి దాదాపు 12 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైన సంగతి తెలిసిందే. కింగ్‌స్టన్‌ అనుబంధ కంపెనీలో స్టాక్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌లో బోల్ట్‌ పెట్టుబడులు పెట్టగా.. షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్‌ అనుమతి లేకుండానే అతని అకౌంట్‌ నుంచి డబ్బు మాయం చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం డబ్బులు మాయం చేసిన సంస్థపై కోర్టులో కేసు వేయగా విచారణ కొనసాగుతుంది.

తాజాగా బోల్ట్‌ తన అకౌంట్‌ నుంచి డబ్బులు మాయమవడంపై స్పందించాడు. కోట్ల రూపాయలు నష్టపోవడంతో బోల్ట్‌ మానసికంగా కుంగిపోయాడని వార్తలు వచ్చాయి. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బోల్ట్‌ ఆ వార్తలను ఖండించాడు. ''మనం కష్టపడి సంపాదించిన రూపాయి కళ్లముందే పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయం నాకు బాధాకరం.. చాలా నిరాశ చెందాను. అయితే నేను మానసిక వేదనకు గురయినట్లు కొన్ని వార్తలు వినిపించాయి. ఈ విషయంలో నాకు నేను కన్ఫ్యూజ్‌ అయ్యను.

ఒక్క విషయం క్లారిటీగా చెప్తున్నా. డబ్బు పోయినందుకు బాధగానే ఉన్నప్పటికి మనసు మాత్రం ముక్కలవ్వలేదు. ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలనేది మా లాయర్లు చూసుకుంటారు. ఆ బాధ్యతను వారికి అప్పగించాను. నా ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మీకందరికి తెలుసు నాకు ముగ్గురు పిల్లలు.. వాళ్లతో పాటు నా తల్లిదండ్రులను కూడా చూసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో అనవసర ఒత్తిడికి గురవ్వడం ఇష్టం లేదు. ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది.'' అని చెప్పుకొచ్చాడు.

2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్‌.. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ ఈవెంట్స్‌ను శాసించాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా నిలిచిపోయాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన ఉసెన్‌ బోల్ట్‌ ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు.

చదవండి: భారత్‌తో టెస్టు సిరీస్‌.. ఫ్లైట్‌ మిస్సయిన ఆసీస్‌ క్రికెటర్‌

మరిన్ని వార్తలు