Darren Lehmann: 'అలా అయితేనే టీమిండియాను కొట్టగలం'.. ఆసీస్‌కు మాజీ క్రికెటర్‌ సూచనలు

23 Jan, 2023 11:40 IST|Sakshi

ఫిబ్రవరిలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌-గావస్కర్‌ టెస్టు సిరీస్‌ మొదలుకానుంది. ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఇప్పటికే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరుకు అర్హత సాధించిన ఆసీస్‌ టీమిండియాతో టెస్టు సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు టీమిండియా కూడా ఈ టెస్టు సిరీస్‌ నెగ్గితేనే వరల్డ్‌ టెస్టు చాంపియనషిప్‌ ఫైనల్‌ ఆడే చాన్స్‌ ఉంటుంది. ఇక నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఫిబ్రవరి 9న మొదలుకానుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ అనంతరం ఇరుజట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.


2017 పర్యటనలో ఆసీస్‌ బౌలర్‌ స్టీవ్‌ ఓకఫీ

ఇక ఆస్ట్రేలియా చివరిసారి 2017లో భారత పర్యటనకు వచ్చినప్పుడు టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియాకు కోల్పోయింది. ఆ సిరీస్‌లో తొలి టెస్టులో ఆసీస్‌ 333 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అప్పటి మ్యాచ్‌లో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ స్టీవ్‌ ఒకఫీ 12 వికెట్లతో టీమిండియాను శాసించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఆ తర్వాత ఫుంజుకున్న టీమిండియా రెండు, నాలుగు టెస్టుల్లో గెలిచి.. మూడో టెస్టు డ్రా చేసుకొని 2-1 తేడాతో సిరీస్‌ గెలిచింది. ఆ తర్వాత 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా రహానే సారధ్యంలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలిచి చారిత్రక విజయాన్ని అందుకుంది. 

తాజాగా ఐదేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా సిరీస్‌ను ఒడిసి పట్టుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ డారన్‌ లీమన్‌ ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా గడ్డపై టెస్టు సిరీస్‌ ఎలా గెలవాలనే దానిపై పలు సూచనలు ఇచ్చాడు.స్పిన్‌ విభాగం ఎంత బలంగా ఉంటే టీమిండియాను అంత బలంగా కొట్టగలం అని పేర్కొన్నాడు. 2017 టీమిండియా పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుకు లీమన్‌ కోచ్‌గా వ్యవహరించాడు.  

తాజాగా ఆస్ట్రేలియన్‌ రేడియో స్టేషన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో డారన్‌ లీమన్‌ మాట్లాడుతూ.. ''సొంతగడ్డపై టీమిండియాను మట్టికరిపించడం అంత ఈజీ కాదు. స్వదేశంలో టీమిండియా ప్రత్యర్థి పాలిట సింహస్వప్నం. తొలి టెస్టులో ఓడిపోయినా తిరిగి ఫుంజుకోవడం వారికి బాగా అలవాటు. 2017 పర్యటనలో మన జట్టు ఆ దెబ్బను రుచి చూసింది. అయితే తెలివిగా వ్యవహరిస్తే టీమిండియాను ఓడించొచ్చు. భారత్‌ పిచ్‌లు స్పిన్‌ బౌలింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యన పేస్‌ ట్రాక్‌లు తయారు చేస్తున్నప్పటికి సంప్రదాయ టెస్టుల్లో స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. 


స్పిన్నర్‌ ఆష్టన్‌ అగర్‌

ఆస్ట్రేలియా జట్టులో ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ ప్రస్తుతం ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. అతనికి తోడుగా ఒక లెగ్‌ స్పిన్నర్‌ కాంబినేషన్‌ కోసం చూడడం మంచింది. లియోన్‌ కాకుండా ఆష్టన్‌ అగర్‌, మిచెల్‌ స్వీప్సన్‌, టాడ్‌ ముర్పే లాంటి స్పిన్నర్లు కూడా జట్టులో ఉన్నారు. ఆష్టన్‌ అగర్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్ కాగా మిచెల్‌ స్వీప్సన్‌ లెగ్‌ స్పిన్నర్‌. మ్యాచ్‌ల పరంగా ఇద్దరు దాదాపు సమానంగా ఉన్నారు. అయితే ఆస్టన్‌ అగర్‌ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ కూడా చేయగల సమర్థుడు. 

కానీ భారత్‌ లాంటి పిచ్‌లపై లెగ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ స్వెప్సన్‌కు వికెట్లు తీయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక ఈ సిరీస్‌కు ఎంపికైన మరొక ఆటగాడు  ఆఫ్‌ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ. ముగ్గురు పేసర్లు.. ఇద్దరు స్పిన్నర్లు.. లేదా ఇద్దరు పేసర్లు.. ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌ అయినా బాగానే ఉంటుంది. ఇద్దరు స్పిన్నర్లు కావాలంటే నా ఓటు ఆస్టన్‌ అగర్‌కే ఉంటుంది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే అప్పుడు మిచెల్‌ స్వీప్సన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు.  టీమిండియా కచ్చితంగా ఇదే తరహాలో జట్టును ఎంపిక చేస్తుంది. అయితే వారికి పిచ్‌పై పూర్తి అవగాహన ఉండడం మనకు ప్రతికూలం. అని పేర్కొన్నాడు.

టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: 
పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్ (వైస్‌ కెప్టెన్‌), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్‌, నాథన్ లియోన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్

టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌:
ఫిబ్రవరి 9-13 వరకు: తొలి టెస్టు, నాగ్‌పూర్‌
ఫిబ్రవరి 17-21 వరకు: రెండో టెస్టు, ఢిల్లీ
మార్చి 1-5 వరకు :   మూడో టెస్టు, ధర్మశాల
మార్చి 9-13 వరకు:    నాలుగో టెస్టు, అహ్మదాబాద్‌

వన్డే సిరీస్‌ షెడ్యూల్‌:
మార్చి 17న తొలి వన్డే, ముంబై
మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం
మార్చి 22న మూడో వన్డే, చెన్నై

చదవండి: 'కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం'

'పంత్‌ త్వరగా కోలుకోవాలి'.. టీమిండియా క్రికెటర్ల పూజలు

మరిన్ని వార్తలు